నటి లీలావతి ఆస్పత్రికి తాళం

Actress Leelavathi Hospital Closed in Karnataka - Sakshi

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : దక్షిణ భారత సీనియర్‌ నటి లీలావతి పేదల కోసం నిర్మించిన ఉచిత ఆస్పత్రిని టీహెచ్‌ఓ మౌలిక సదుపాయాలు లేవనే సాకుతో మూసివేసిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. సీనియర్‌ నటి లీలావతి, ఆమె కుమారుడు, కన్నడ సినీ హీరో నోద్‌రాజ్‌ ఇద్దరూ కలిసి నెలమంగల సమీపంలోని సోలదేనహళ్లి వద్ద 2009లో పేద ప్రజల కోసం సొంత స్థలంలో సొంత నిధులతో ఉచిత ఆస్పత్రిని నిర్మించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆస్పత్రి నిర్వహణ చూసుకుంటామని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది.

ఈ ఆస్పత్రి వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పడంతోపాటు, దగ్గరలోనే ఉచిత వైద్యం లభించింది. అయితే నెలమంగల టీహెచ్‌ఓ హరీష్‌ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేవనే కారణం చూపి గురువారం ఆస్పత్రికి తాళంవేసి మూసివేయించడంతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యులు, వైద్య సిబ్బందిని వెనక్కు తీసుకున్నారు. సమాచారం అందుకున్న వినోద్‌రాజ్‌.. కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కరిగౌడను కలిసి ఆస్పత్రిని తిరిగి తెరవాలని కోరారు. పేదల కోసం తన తల్లి లీలావతి ఎంతో శ్రమతో ఆస్పత్రిని కట్టించారన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిపోయి ఆస్పత్రి మూసివేయడం బాధాకరమని వినోద్‌రాజ్‌ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top