పల్లె నుంచి పర్వత అంచుల వరకు

kilimanjaro tracker chinnamma special interview - Sakshi

బీసీ రాయ్, కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన చిన్నమ్మలు

 పిన్ని సాయంతో కష్టాలకు ఎదురీదిన ధీర వనిత

ఇది ఓ పడతి సాగిస్తున్న ప్రయాణం. బాధ నుంచి నవ్వు వరకు, ఓటమి నుంచి గెలుపు వరకు, పల్లె నుంచి పర్వత అంచుల వరకు ఓ సాధారణ గ్రామీణ యువతి సాగిస్తున్న పయనం. పేరు చిన్నమ్మలు. వయసు 23. ఘనతలు చెప్పాలంటే మాత్రం మాటలు చాలవు. బీసీ రాయ్, కిలిమంజారో పర్వత శిఖరాలను అధిరోహించిన చిన్నమ్మలు ఆ పర్వత సానువుల కంటే పదునైన కష్టాలు అనుభవించింది. ఆ కొండరాళ్ల కంటే కఠినమైన పరిస్థితులకు ఎదురెళ్లింది. ఒక్కొక్కటిగా దాడి చేసిన కష్టాలు ఆమెను అవరోహణ దిశలో పడేస్తే అధిరోహణ అనే విన్యాసంతో ఆమె మళ్లీ బతుకును ఓ దారిన పెట్టింది. ఆ దారిని పదిమందికీ స్ఫూర్తిదాయకంగా మార్చింది. చిన్నమ్మలు విజయం గురించి లోకమంతా చెప్పుకుంటోంది. అదే సమయంలో ఆమె ఓటములను ఓ సారి చూద్దాం. చిన్నప్పుడే గుండెల్లో ఉండిపోయిన కన్నీటి చెమ్మను గమనిద్దాం. చనిపోయిన అమ్మానాన్నల కోసం చిన్నమ్మలు చేస్తున్న కనిపించని అన్వేషణకు ఓ కన్నీటి బొట్టును నివాళిగా అర్పిద్దాం.  

పల్లె నుంచి..
కష్టపడితే గానీ పూట గడవని నిరుపేద కుటుంబానికి చెందిన వంగర మండలం కొత్తమరువాడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల గేదెల చిన్నమ్మలు ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని 19 వేల అడుగుల కిలిమంజారో పర్వతం, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న బీసీరాయ్‌ పర్వతాలను అధిరోహించింది. గిరిజన తెగలో ఎరుకుల కులానికి చెందిన ఆమె కుటుంబం వృత్తి రీత్యా వెదురు కర్రలతో బుట్టలు అల్లికలు చేసుకొని జీవనం సాగించేవారు. సీజనల్‌గా బాణసంచా తయారీ వంటి పనులు చేపట్టే వారు. సరిగ్గా ఆమెకు ఏడేళ్ల వయసులో 2002 జూన్‌ 25న బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి అమ్మ కృష్ణవేణి, తండ్రి రమణ, అక్క విజయగౌరీ, తమ్ముడు సాయి కిరణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్నాన్న గేదెల భాస్కరరావు, పిన్ని దేవిలు ఆమెను అక్కున చేర్చుకుని చదివించారు.

పర్వత అంచుల వైపు..
2015 ఫిబ్రవరి 15న కొత్తమరువాడలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో చిన్నాన్న భాస్కరరావుతోపాటు కుటుంబానికి చెందిన మరో ఏడుగురు మృతి చెందారు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన కష్టాలు ఆమెను కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రాణాపాయం నుంచి బయటపడిన పిన్ని గేదెల దేవి సంరక్షణలో చిన్నమ్మలు పెరిగింది. నా అన్న వాళ్లు లేరన్న బాధ ఆమెలో రగిలిపోయింది. పేదరికంతో జీవనం సాగిస్తూ మనసులో రేగే కసిని కూడగట్టి పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పంతో చదివింది. పర్వతారోహణపై ఇష్టం పెంచుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ.. గమ్యం వైపు అడుగులు వేసి నిజ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుతోంది. సమాజ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి విజయనగరం జిల్లా పార్వతీపురంలో హిందీ బీఈడీలో ట్రైనింగ్‌ పొందుతోంది. ప్రస్తుతం చిన్నమ్మలు పిన్ని దేవి విజయనగరం జిల్లా మక్కువలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేయడంతో ఆమె సంరక్షణలో ఉంది.

శిక్షణ
చిన్నమ్మలు జిల్లా యువజన సర్వీసుల శాఖ సహకారంతో డార్జిలింగ్‌లోని హిమాలియన్‌ మౌంటెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌(హెచ్‌.ఎం.ఐ)లో శిక్షణ పొందింది. ఈ క్రమంలో  2016 నెలలో చైనా సరిహద్దు ప్రాంతమైన డోక్లా సమీపంలో మనదేశం డార్జిలింగ్‌కు కొంత దూరంలో సిక్కిం నుంచి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న బీసీరాయ్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించిన యువతిగా చిన్నమ్మలు కీర్తి గడించారు. అప్పట్లో  ప్రభుత్వం జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా ఈ విజయాన్ని సాధించింది. గత ఏడాది ఆగస్టులో కిలీమంజారో పర్వతం అధిరోహించేందుకు సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివశంకర్‌ సహకారం అందించారు.

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిస్తా
ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడమే నా లక్ష్యం. కిలీ మంజారో, బీసీరాయ్‌ పర్వతాలను అధిరోహించా. ప్రపంచంలోని అన్ని ఎత్తైన శిఖరాలని అధిరోహించి ఆండీస్‌ పర్వతాలపై తనువు చాలించిన మల్లి మస్తాన్‌ నాకు స్ఫూర్తి. చిన్నతనం నుంచి సమస్యలతో జీవనం సాగించా. మా చిన్నతనంలోనే అమ్మ, నాన్న, తోబుట్టువులు బాణసంచా పేలుళ్లలో మృతిచెందగా, అన్ని తానై ఉన్న మా చిన్నాన్న భాస్కరరావుతోపాటు మా కుటుంబంలో ఉన్న వారంతా ఆ పేలుళ్లలో మరణించారు. చివరికి మా పిన్ని దేవి నా జీవితాన్ని చక్కదిద్దింది. నన్ను ఇంతటి దాన్ని చేసింది. ఆమెకు రుణపడి ఉంటా. – గేదెల చిన్నమ్మలు, పర్వతారోహకురాలు, కొత్తమరువాడ.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top