
అలవోకగా... అలవాటుగా...
భారత్, జింబాబ్వే వన్డే సిరీస్‌లో మ్యాచ్‌ల తేదీలు మాత్రమే మారాయి. అదే వేదిక, అదే ఫలితం...
భారత్, జింబాబ్వే వన్డే సిరీస్‌లో మ్యాచ్‌ల తేదీలు మాత్రమే మారాయి. అదే వేదిక, అదే ఫలితం... అదే తరహాలో జింబాబ్వే చెత్త బ్యాటింగ్, భారత్ అలవోక ఛేదన. మూడో మ్యాచ్‌లోనూ గత మ్యాచ్‌కంటే తక్కువ స్కోరు నమోదు చేసిన జింబాబ్వే మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా... కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మూడు మ్యాచ్‌ల సిరీస్ గెలిచిన జట్టుగా ధోని సేన కొత్త రికార్డు సాధించింది.
భారత్‌కు మరో సునాయాస విజయం
* 10 వికెట్లతో జింబాబ్వే చిత్తు
* 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
హరారే: జింబాబ్వే గడ్డపై భారత జట్టు వరుసగా మూడో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌గా ముగించింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. సిబాందా (71 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, బుమ్రా (4/22) చెలరేగాడు.
అనంతరం భారత్ 21.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 126 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (70 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడిన ఫైజ్ ఫజల్ (61 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సునాయాసంగా గెలిపించారు.
నాలుగు బంతుల్లో 4 వికెట్లు
అతి జాగ్రత్తకు పోయి ఇన్నింగ్స్ తొలి 102 బంతుల్లో పరుగులు రాని 81 బంతులు ఆడిన జింబాబ్వే ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఒక దశలో 104/3తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు మరో 19 పరుగులకే మిగతా 7 వికెట్లు కోల్పోయింది. 33వ ఓవర్లో చివరి రెండు బంతులకు బుమ్రా 2 వికెట్లు తీయగా...తర్వాతి ఓవర్లో రెండో బంతికి అక్షర్ మరో వికెట్ పడగొట్టాడు. అంతకు ముందు బంతికి రనౌట్ రూపంలో వికెట్ లభించింది. ఈ నాలుగు వికెట్ల తర్వాత ఆ జట్టు కోలుకోలేకపోయింది.
వికెట్ కోల్పోకుండా...
అతి స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు సునాయాసంగా ఛేదించారు. రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించగా, ఫజల్ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్, ఫజల్ చెరో 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జింబాబ్వే బౌలర్లు కనీస ప్రభావం చూపకపోవడంతో మరో 28.1 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ మ్యాచ్ గెలుచుకుంది.
స్కోరు వివరాలు:-
జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జ (సి) రాహుల్ (బి) ధావల్ 8; చిబాబా (సి) బుమ్రా (బి) చహల్ 27; సిబాందా (సి) అండ్ (బి) చహల్ 38; మరుమా (బి) బుమ్రా 17; వాలర్ (రనౌట్) 8; చిగుంబురా (సి) ధోని (బి) బుమ్రా 0; ముతుంబామి (సి) రాహుల్ (బి) బుమ్రా 4; క్రీమర్ (ఎల్బీ) (బి) అక్షర్ 0; మద్జివ (నాటౌట్) 10; ముపరివ (సి) పాండే (బి) బుమ్రా 1; తిరిపనో (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 123.
వికెట్ల పతనం: 1-19; 2-55; 3-89; 4-104; 5-104; 6-104; 7-104; 8-108; 9-110; 10-123.
బౌలింగ్: బరీందర్ 8-0-40-0; ధావల్ 6.2-1-17-1; బుమ్రా 10-1-22-4; అక్షర్ 10-2-16-1; చహల్ 8-0-25-2.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 63; ఫజల్ (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (21.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 126.
బౌలింగ్: తిరిపనో 5-1-15-0; మద్జివ 5-0-25-0; ముపరివ 6-0-43-0; క్రీమర్ 4-0-26-0; చిబాబా 1.5-0-15-0.
తన కూతురు జీవా అంటే తనకు ఎంత ప్రేమో ధోని అవకాశం దొరికినప్పుడల్లా ప్రదర్శిస్తుంటాడు. అయితే బిజీ షెడ్యూల్‌తో అతను చాలా సార్లు ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాంతో 15 నెలల ఆ పాప ఇంకా తనను గుర్తు పట్టడం లేదట! జింబాబ్వే సిరీస్ తర్వాత తాను ఇంటి పట్టునే ఉండబోతున్నానని ధోని చెబుతున్నాడు. ‘చాలా రోజుల తర్వాత ఎక్కువ విరామం లభిస్తోంది. పాప ఇప్పటికీ నన్ను గుర్తు పట్టడం లేదు. ఇప్పుడు ఆమెతో ఎక్కువ సమయం గడిపి నేను నాన్నను అని అర్థమయ్యేలా చేస్తా’ అని సరదాగా చెప్పాడు.