వీరికి ఇదే అవకాశం


యువ ఆటగాళ్లకు పరీక్షగా మారిన జింబాబ్వే టూర్

కొంత మంది సీనియర్లకు కూడా


 

సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు. పూర్తిగా యువకులతో కూడిన జట్టు కాకపోయినా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు గతంలో ఆడి తెరమరుగయిన ఆటగాళ్లకు కూడా మరోసారి ఛాన్స్ ఇచ్చారు. తొలిసారి ప్రతిభ చూపేందుకు కొత్త ఆటగాళ్లు ఆరాటపడుతుండగా, ఈ సిరీస్‌లోనైనా నిరూపించుకోవాలని గతంలో ఆడిన ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిమానులు కాస్త ఆసక్తిగా గమనించేబోయే ఆటగాళ్లను పరిశీలిస్తే...

 

సందీప్ శర్మ..

భారత  పేసర్లు బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడం లేదని బంగ్లాతో సిరీస్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. అంటే ధోనికి ప్రస్తుత బౌలర్లపై కాస్త నమ్మకం తగ్గిందనే చెప్పాలి. ఇలాంటి దశలో జట్టులో చోటు సంపాదించాడు సందీప్ శర్మ. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన పంజాబ్ జట్టులో ఆడి అంద ర్నీ ఆకట్టుకున్న ఆటగాడు సందీప్ శర్మ. ఈ సీజన్‌లో 13 వికెట్లు, గత సీజన్‌లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. రంజీ సీజన్‌లో 36 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకునే సందీప్‌కు జింబాబ్వే పిచ్‌లు సహకరించకపోవచ్చు. అయినా భువనేశ్వర్‌కు జోడీగా రెండో ప్రధాన పేసర్‌గా జట్టులో చోటు దక్కే అవకాముంది. సందీప్ వయసు 22 ఏళ్లే కాబట్టి చాలాకాలం పాటు భారత జట్టుకు అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సత్తా చాటితే ఇక జాతీయ జట్టులో చోటు సుస్థిర స్థానం సంపాదించినట్లే.

 

హర్భజన్ సింగ్..

35 ఏళ్ల హర్భజన్ సింగ్ గురించి కొత్త చెప్పెదేమి లేదు. భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. వయసు దృష్ట్యా భజ్జీ భవిష్యత్తులో ఎక్కువ కాలం జట్టులో కొనసాగే అవకాశం లేదు. అయితే అశ్విన్ మినహా మిగిలిన స్పిన్నర్లు  జడేజా, అక్షర్ విఫలమవుతున్న ప్రస్తుత సందర్భంలో హర్భజన్ అవకాశాలను కొట్టిపారేయలేం. మరికొంత కాలమైనా జట్టులో చోటు పదిలం చేసుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం ముఖ్యం. పైగా గత నెలలో ఆడిన ఏకైక టెస్టులో పెద్దగా రాణించింది లేదు. ఈ సిరీస్ భజ్జీకి కెరీర్‌కు కీలకం కానుంది.

 

మనీష్ పాండే..

ప్రస్తుత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నేతృత్వంలో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. ఐపీఎల్ రెండో సీజన్‌లో సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్ట్రోక్ ప్లేతో పాటు వేగంగా ఆడడంలోనూ దిట్ట. టాపార్డర్, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ తొలి మూడు సీజన్లు బెంగుళూరు జట్టుకు ఆడిన 25 ఏళ్ల మనీష్.. తర్వాత  కోల్‌కతాకు మారాడు. ఆ జట్టు మిడిలార్డర్‌లో వెన్నెముకలా తయారయ్యాడు. రంజీల్లో కర్ణాటక తరఫున 50కి మించి సగటుతో 5వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది విజయ్‌హజరే ట్రోఫీలో ఏకంగా 118 సగటుతో 652 పరుగులు చేశాడు. గత డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో టీ20 మ్యాచ్‌కు ఎంపికైనా.. ఆ జట్టు పర్యటనను రద్దు చేసుకోవడంతో మళ్లీ ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తుది జట్టులో కూడా మనీష్‌కు చోటు ఉండే అవకాశం ఉంది. భారత్-ఎ తరఫున కూడా సత్తా చాటిన మనీష్ భవిష్యత్తులో స్టార్ ఆటగాడిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

 

మురళీ విజయ్..

ప్రస్తుతం విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత ఆటగాడు మురళీ విజయ్. దిగ్గజాలు సైతం పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన ఇంగ్లండ్, ఆసీస్‌ల్లో సత్తా చాటాడు. అయితే అది టెస్టుల్లోనే. వన్డేల్లో పరిస్థితి వేరేలా ఉంది.ఇప్పటివరకు 14 వన్డేలు ఆడినా సగటు 20కి మించలేదు. పైగా శిఖర్, రోహిత్‌లు ఓపెనర్లుగా స్థానాలను పదిలం చేసుకోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ సిరీస్‌లో సత్తా చాటితే మరో రిజర్వ్ ఓపెనర్ దొరుకుతాడు. ఓపెన ర్లలో ఎవరైనా గాయపడితే ప్రత్యామ్నాయం ఉండడం అవసరం. ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తరఫున పెద్దగా రాణించకపోయినా.. రంజీల్లో 1,042 పరుగులు సాధించాడు.

 కీపింగ్ స్థానం కోసం..

దాదాపు ధోని వచ్చిన కొంతకాలానికే జట్టులో చోటు పొందిన రాబిన్ ఉతప్ప ఇప్పుడు దేశవాళీలకే పరిమితమయ్యాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తున్న సెలక్టర్లు చాలా రోజులుగా ఉతప్పను పట్టించుకోలేదు. ఐపీఎల్, దేశవాళీల్లో గత రెండు సీజన్లుగా  టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో కీపింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. ఓపెనర్‌గానే కాకుండా లోయర్ అర్డర్‌లో కూడా ఆడే సామర్థ్యం ఉంది. ధోని కూడా మూడేళ్లకు మించి ఆడే అవకాశాలు లేనందున రిజర్వ్ కీపర్‌గా ఉపయోగపడతాడు. అయితే మరో ఆటగాడు కేదార్ జాదవ్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది. వికెట్‌ను అంత సులభంగా ప్రత్యర్థి సమర్పించుకొని కేదార్ ఓంటరి పోరాటం చేయగలడు. టెయిలెండర్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. కీపింగ్ కూడా చేయగల కేదార్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది.

 

మనోజ్ తివారీ..

ఎప్పుడో 2008లోనే ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డలోనే ఆరంగేట్రం చేశాడు మనోజ్ తివారీ. ప్రతిభ ఉన్న యువ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న తివారీ వయసు ప్రస్తుతం  29 ఏళ్లు. ఇప్పటివరకు ఆడింది 9 వన్డేలే. ప్రతిసారి జట్టులోకి సెలక్ట్ అవడం, గాయంతో తప్పుకోవడం అలవాటుగా మారింది. దాంతో సెలక్టర్లు కొన్నేళ్లుగా అతణ్ని పరిగణించడమే మానేశారు. గతేడాది చివరిసారిగా బంగ్లాతో వన్డే ఆడాడు. సీనియర్లు తప్పుకోవడం మళ్లీ పిలుపు అందుకున్నాడు. లక్ష్మణ్ సలహాలతో రాటుదేలుతానని చెప్పిన తివారీ ఈసారైనా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. మిడిలార్డర్‌లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో విజయవంతమైతే మన రిజర్వ్ బెంచ్ మరింత బలపడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top