అదే బుమ్రా వైఫల్యానికి కారణం: జహీర్‌

Zaheer EXplains Why Bumrah Returned Wicket Less In ODI Series - Sakshi

న్యూఢిల్లీ:  న్యూజిలాండ్‌తో  జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇలా ఒక సిరీస్‌లో బుమ్రా వికెట్‌ కూడా తీయకపోవడం ఇదే మొదటిసారి. తన కెరీర్‌లో అతను ఇప్పటివరకూ 16 సిరీస్‌లు ఆడగా, ఇటీవల స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో కూడా మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఒకటే వికెట్‌ పడగొట్టాడు. దాంతో బుమ్రాపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే బుమ్రా బౌలింగ్‌ వైఫల్యంపై ఇప్పటికే  కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అండగా నిలవగా,  ఇప్పుడు టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ సైతం మద్దతుగా నిలిచాడు. బుమ్రా ఒక ప్రమాదకర బౌలర్‌ అంటూనే మరింత దూకుడుగా అతను బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించాడు. (ఇక్కడ చదవండి: బుమ్రాకు మద్దతిచ్చిన కివీస్‌ కెప్టెన్‌)

‘ అతి తక్కువ సమయంలోనే బుమ్రా ఒక కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా బౌలింగ్‌ను ఆడాలంటే ప్రత్యర్థి జట్లలో వణుకు పుడుతోంది. బుమ్రా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బుమ్రా బౌలింగ్‌లో రిథమ్‌ ఏమీ తగ్గలేదు. కానీ అవతలి ఆటగాళ్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడాలనే తలంపుతో బరిలోకి దిగుతున్నారు. ఒక వన్డే మ్యాచ్‌లో బుమ్రా ఓవర్లలో 35 పరుగులు వచ్చినా ఫర్వాలేదు కానీ వికెట్‌ను ఇవ్వకూడదనే ధోరణితో దిగుతున్నారు. దాంతో బుమ్రాను ఆచితూచి ఆడుతున్నారు. అదే సమయంలో మిగతా బౌలర్లపై ఎటాక్‌కు దిగుతున్నారు. దాంతోనే బుమ్రా వికెట్లను సాధించడం కష్టమవుతుంది. ఇక బుమ్రా తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తన బౌలింగ్‌ను రక్షణాత్మక ధోరణితో ఆడుతున్నారనే విషయం బుమ్రాకు కూడా తెలుసు. దాంతో వికెట్లను ఏ విధంగా సాధించాలి అనే దానిపై బుమ్రా దృష్టి నిలపాలి. బ్యాట్స్‌మెన్‌ తప్పులు చేసే విధంగా బౌలింగ్‌కు పదును పెట్టాలి. ఎందుకంటే బుమ్రా బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు ఇవ్వకుండా ఉండటానికే ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా కనబడుతోంది. దీనిపై బుమ్రా ఫోకస్‌  పెట్టి మరింత దూకుడైన బౌలింగ్‌ను రుచిచూపించాలి’ అని జహీర్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top