
యువరాజ్ సింగ్ వచ్చేశాడు..
వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టులో యువరాజ్ కు చోటు దక్కింది.
క్రికెట్ ను ఆస్వాదించినంత కాలం ఆడతా- ఇటీవల కాలంలో తరచు యువరాజ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్య. యువరాజ్ కు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. టీమిండియా జట్టులో మరొక అవకాశం ఇచ్చే అర్హత అతనికి ఉంది. భారత్ బ్యాటింగ్ బాగుండాలంటే సీనియర్లు అవసరాన్ని కూడా గుర్తించాలి- ఇది మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ దక్షిణాఫ్రికాతో సిరీస్ జరుగుతున్న సమయంలో యువరాజ్ గురించి చేసిన కామెంట్. ఇదిలా ఉంచితే.. తన ఫామ్ నే నమ్ముకుని జట్టులో పునరాగమనం కోసం యువరాజ్ శతవిధాలా చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టులో యువరాజ్ కు చోటు దక్కింది. ఈ మేరకు భారత చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని శనివారం సమావేశమైన సెలక్షన్ కమిటీ యువరాజ్ కు అవకాశం కల్పించారు. ఆస్ట్రేలియాతో జరిగే మూడు ట్వంటీ 20 లకు 15 మంది సభ్యులతో కూడిన బృందంలో యువరాజ్ తో పాటు, భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాను కూడా ఎంపిక చేశారు. వీరితో పాటు హర్భజన్ సింగ్ కు ట్వంటీ 20 ల్లో చోటు దక్కింది.
ఇదిలా ఉండగా, అంతా ఊహించినట్లుగానే అద్భుతమైన ఫామ్ తో ఉన్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు కల్పించారు. జడేజాతో పాటు పేసర్ మహ్మద్ షమీకి వన్డే జట్టులో స్థానం దక్కింది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన వన్డే, ట్వంటీ 20 జట్లను సెలక్టర్లు ప్రకటించారు. కాగా, మార్చిలో భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ వరకూ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోనినే కెప్టెన్ గా కొనసాగించనున్నట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.
వన్డే జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, గుర్ కీరత్ సింగ్, రిషి ధవన్, బ్రయందర్ సింగ్ శ్రాన్
ట్వంటీ 20 జట్టు:ఎంఎస్ ధోని(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అశిష్ నెహ్రా