ఇది తగదు.. మార్చాల్సిందే:  విలియమ్సన్‌

World Test Championship Points System Unfair, Williamson - Sakshi

వెల్లింగ్టన్‌:  ‘గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్‌షిప్‌ అనేది ఒక సుప్రీం’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొంటే,  ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల విధానం సరైనది కాదు. ప్రస్తుతం అవలభింస్తున్న తీరుతో చాలా జట్లకు అన్యాయం జరుగుతుంది’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు. టెస్టు చాంపియన్‌షిప్‌లో గెలిచిన జట్టుకు ఇస్తున్న పాయింట్ల తీరు సరిగా లేదన్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తుంటే, అదే ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 24 పాయింట్ల చొప్పున ఇస్తున్నారు. 

అంటే టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఒక సిరీస్‌ను ఒక జట్టు క్లీన్‌స్వీప్‌ చేస్తే గరిష్టంగా 120 పాయింట్లు సాధిస్తుంది. దీన్నే విలియమ్సన్‌ తప్పుబట్టాడు. ‘ టెస్టు చాంపియన్‌షిప్‌ అనేది సరికొత్త ప్రయోగం. అంతవరకూ బాగానే ఉంది. పాయింట్ల పద్ధతి సరిగా లేదు. ఈ చాంపియన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విధానం సరైనది కాదు. రాబోవు కాలంలో ఒక సవ్యమైన మార్గంలో చాంపియన్‌షిప్‌ నిర్వహించాలంటే మార్గాలను వెతకాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పాయింట్ల విధానమైతే నా దృష్టిలో సరైనది కాదు’ అని విలియమ్సన్‌ తెలిపాడు. టీమిండియాతో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానున్న తరుణంలో విలియమ్సన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (ఇక్కడ చదవండి; ‘టెస్టు’ సమయం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top