‘టెస్టు’ సమయం

India vs New Zealand 1st Test 20 February 2020 - Sakshi

రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్‌ తొలి టెస్టు

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

సత్తా చాటేందుకు విలియమ్సన్‌ సేన సిద్ధం

ఉదయం 4 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

ఉపఖండం బయట ఇతర దేశాల్లో పోలిస్తే న్యూజిలాండ్‌లోనే భారత జట్టు తక్కువ సంఖ్యలో టెస్టు క్రికెట్‌ ఆడింది. 1967 నుంచి 2014 వరకు 9 టెస్టు సిరీస్‌లలో పాల్గొంటే ఆడిన మ్యాచ్‌లు 23 మాత్రమే! గత ఏడాది కివీస్‌ పర్యటనలో కూడా టెస్టులు ఆడాల్సి ఉండగా... తెల్లవారుజామున భారత అభిమానులు టెస్టులు చూడరంటూ ప్రసారకర్తలు తెచ్చిన ఒత్తిడితో షెడ్యూల్‌ నుంచి టెస్టులను తొలగించి వన్డేలు, టి20లకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో తప్పనిసరిగా ఆడాల్సిన స్థితిలో భారత జట్టు ఐదు రోజుల ఫార్మాట్‌కు సన్నద్ధమైంది. స్వింగ్‌కు బాగా అనుకూలించే కివీస్‌ పిచ్‌లపై టీమిండియాకు ఎర్రబంతితో అతి పెద్ద సవాల్‌ ఎదురవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రేపటితో తెర లేవనుంది.

వెల్లింగ్టన్‌: టి20, వన్డే సిరీస్‌లను సమంగా పంచుకున్న తర్వాత భారత్, న్యూజిలాండ్‌ ఇప్పుడు సాంప్రదాయ ఫార్మాట్‌కు సై అంటున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి (శుక్రవారం) తొలి మ్యాచ్‌ జరుగుతుంది. సొంతగడ్డపై వరుస సిరీస్‌ విజయాల తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు బరిలోకి దిగుతుండగా... ఇటీవలే ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన కివీస్‌ స్వదేశంలో తమ రాత మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. కోహ్లి నాయకత్వంలో న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ టెస్టులు ఆడుతుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.  

విహారికి చోటు!  
టీమిండియా తమ ఆఖరి టెస్టును కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై ఆడింది. అక్కడితో పోలిస్తే వాతావరణం, పిచ్‌ పరిస్థితులు న్యూజిలాండ్‌లో పూర్తిగా భిన్నం కాబట్టి స్వల్ప మార్పులు ఖాయం. రోహిత్‌ శర్మ గాయంతో దూరం కావడంతో మయాంక్‌కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్‌ చేయడం దాదాపుగా ఖాయమైంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ ఇదే సంకేతాన్నిచ్చింది. కాబట్టి శుబ్‌మన్‌ గిల్‌ టెస్టు అరంగేట్రం కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అయితే ప్రతికూల వాతావరణంలో కివీస్‌ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు.

జట్టుకు శుభారంభం దక్కకపోతే ఆ తర్వాత అది మ్యాచ్‌పై ప్రభావం చూపించవచ్చు. సొంతగడ్డపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌నే ఆడించేది. కానీ కివీస్‌లాంటి చోట లోతైన బ్యాటింగ్‌ అవసరం కాబట్టి ఆరో స్థానంలో కూడా రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ను ఆడించక తప్పని పరిస్థితి. అందుకోసం ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి అతను సాధించిన సెంచరీ కూడా విహారికి అనుకూలంగా మారింది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లకే మొగ్గు చూపవచ్చు. గత రెండున్నరేళ్లలో ఇదే వ్యూహంతో విదేశాల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్‌ చేశామంటూ కోహ్లి వ్యాఖ్యానించడం అతని ఆలోచనను స్పష్టం చేసింది.

గాయం నుంచి కోలుకున్న ఇషాంత్‌ శర్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. కాబట్టి అతనితో పాటు షమీ, బుమ్రాలు పేస్‌ భారం మోస్తారు. స్పిన్నర్‌గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్‌ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిరం. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. కీపర్‌గా సందేహం లేకుండా వృద్ధిమాన్‌ సాహానే ఉంటాడు కాబట్టి రిషభ్‌ పంత్‌కు నిరాశ తప్పదు. 2014లో ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో కోహ్లి, పుజారా, రహానే, జడేజా, ఇషాంత్, షమీలకు ఉంది. కాబట్టి పరిస్థితులు పూర్తిగా కొత్త కాదు. ఆస్ట్రేలియాలో గెలిచినట్లుగా న్యూజిలాండ్‌లోనూ సిరీస్‌ విజయం సాధిస్తే నాయకుడిగా కోహ్లి ఘనతల్లో మరొకటి చేరుతుంది.  

► న్యూజిలాండ్‌ గడ్డపై 9 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్‌ 2 గెలిచి, 5 ఓడింది. మరో 2 డ్రాగా ముగిశాయి. 2014 సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1–0తో గెలిచింది.  
► భారత్‌ గెలిచిన టెస్టుల సంఖ్య. మొత్తం 23 ఆడగా... కివీస్‌ 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మిగిలిన 10 ‘డ్రా’గా ముగిశాయి.
► 30 భారత్‌లో 2016లో జరిగిన సిరీస్‌లో  చివరిసారి ఈ రెండు జట్లు తలపడగా... భారత్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది

వాగ్నర్‌ అవుట్‌!
తొలి టెస్టుకు ముందే కివీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. భార్య ప్రసవం కారణంగా వాగ్నర్‌ వెల్లింగ్టన్‌కు రావడం లేదని కివీస్‌ బోర్డు ప్రకటించింది. గత కొన్నేళ్లలో బౌల్ట్, సౌతీలతో పోలిస్తే వాగ్నర్‌ అత్యంత ప్రమాదకర కివీస్‌ బౌలర్‌గా మారాడు. కీలకమైన మ్యాచ్‌కు ముందు అతను దూరం కావడం జట్టుపై ప్రభావం చూపడం ఖాయం. ఇది సీనియర్లు బౌల్ట్, సౌతీలకు అదనపు భారం కానుంది. వాగ్నర్‌ స్థానంలో హెన్రీని తీసుకున్నారు. అయితే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ అయిన హెన్రీ టెస్టు రికార్డు మరీ పేలవంగా ఉంది. సొంతగడ్డపైనే 6 టెస్టులో 12 వికెట్లు తీయగా సగటు 50కు పైగా ఉంది! అయితే మ్యాచ్‌ ముందు రోజు పిచ్‌ను బట్టి చూస్తే కివీస్‌ నలుగురు పేసర్లతో దిగాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

కైలీ జేమీసన్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయవచ్చు. ఏకైక స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇటీవల న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ విఫలమైంది. ఇప్పుడు దానిని చక్కబెట్టుకునేందుకు ఆ జట్టుకు అవకాశం వచ్చింది. లాథమ్, బ్లన్‌డెల్‌ ఓపెనర్లుగా శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడు, నాలుగు స్థానాల్లో విలియమ్సన్, రాస్‌ టేలర్‌ల అనుభవమే జట్టుకు కీలకం. వీరిద్దరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌ బ్యాట్స్‌మన్‌గా కూడా తన సత్తా ఏమిటో ఇటీవలే ఇంగ్లండ్‌పై అద్భుత డబుల్‌ సెంచరీతో చూపించాడు. చివరి వన్డేలో భారత్‌ ఓటమికి కారణమైన గ్రాండ్‌హోమ్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటగలడు. మొత్తంగా కివీస్‌ బ్యాటింగ్‌ కూడా బలంగానే కనిపిస్తోంది. భారత పేస్‌ త్రయాన్ని వీరు సమర్థంగా ఎదుర్కోగలిగితే ఆపై జట్టును ఆపడం కోహ్లి బృందానికి కష్టం కావచ్చు.  

తుది జట్ల వివరాలు (అంచనా):  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, అశ్విన్‌/రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), లాథమ్, బ్లన్‌డెల్, రాస్‌ టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్, సౌతీ, జేమీసన్, బౌల్ట్, హెన్రీ.  

పిచ్, వాతావరణం  
బేసిన్‌ రిజర్వ్‌ మైదానం పిచ్‌పై బుధవారం 15–18 మిల్లీ మీటర్ల మందం పచ్చిక కనిపించింది. మ్యాచ్‌ రోజు కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి పేసర్లకు బాగా అనుకూలం. పైగా ఇది ఓపెన్‌ గ్రౌండ్‌ కావడం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు స్వింగ్‌ను శాసిస్తాయి. బ్యాట్స్‌మెన్‌ ఆరంభ పరీక్షను అధిగమించాల్సి ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోవచ్చు. వర్షం సమస్య లేదు.  

మరో మూడేళ్లు ఇంతే జోరుగా...
గత ఎనిమిదేళ్లుగా నేను మ్యాచ్‌లతో పాటు ప్రయాణాలు, ప్రాక్టీస్‌లు కలుపుకుంటే సంవత్సరంలో దాదాపు 300 రోజులు క్రికెట్‌ ఆడుతున్నాను. అయినా ఎక్కడా దూకుడు, తీవ్రత తగ్గదు. ఇక కెప్టెన్‌గా అదనపు ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం. ఇదే జోరులో నేను అన్ని ఫార్మాట్‌లలో కనీసం వచ్చే మూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలను. మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. శరీరం అలసిపోవడం సహజమే కానీ అప్పుడప్పుడు తీసుకునే విరామాల వల్ల నేను మళ్లీ కోలుకోగలుగుతున్నా. గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్‌షిప్‌కే నేను అగ్రస్థానం ఇస్తా.  
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌  


వెల్లింగ్టన్‌లో ఇండియన్‌ హై కమిషన్‌ ఇచ్చిన విందులో...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top