ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన పూల్ బి మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన పూల్ బి మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ప్రపంచ కప్ రికార్డు నెలకొల్పాడు.
టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే విండీస్ ఓపెనర్ స్మిత్ ను అవుట్ చేసి.. తొలి ఇరవై ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాచ్ ముగిసే సరికి విండీస్ కు ఇన్ని పరుగులు సమర్పించుకుంటుందని ఊహించి ఉండరు. కానీ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ కు తోడు శామ్యూల్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారీ స్కోరు నమోదు చేసింది. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 215 పరుగులు చేసిన గేల్.. మసకద్జా వేసిన చివరి ఓవర్ ఆఖరు బంతికి చిగుంబరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 156 బంతులు ఎదుర్కొన్న మార్లన్ శ్యామ్యూల్స్ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 133 పరుగులుచేసి నాట్ అవుట్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో పన్యగర, మసకద్జా చెరో వికెట్ తీశారు.