ధ్యాన్‌చంద్‌ను క్యూలో నిలబెట్టారు

When Major Dhyan Chand stood in queue to watch hockey - Sakshi

ఆత్మకథలో వెల్లడించిన మాజీ కెప్టెన్‌ గుర్‌బక్ష  సింగ్‌

కోల్‌కతా: భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌. తన అసాధారణ ఆటతీరుతో జర్మనీ నియంత హిట్లర్‌నే మెప్పించిన ఈ అలనాటి స్టార్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించారు. ఇప్పుడైతే వేనోళ్ల స్తుతిస్తున్నారు... ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కానీ... ఆయన కెరీర్‌ ముగియగానే దిక్కుమాలిన రాజకీయాలతో ఘోరంగా అవమానించారని భారత హాకీ మాజీ కెప్టెన్‌ గుర్‌బక్ష  సింగ్‌ తన ఆత్మకథ ‘మై గోల్డెన్‌ డేస్‌’లో పేర్కొన్నారు.

ధ్యాన్‌చంద్‌ ఆట చూసేందుకు క్యూ కట్టిన రోజులున్నాయి. అయితే 1962లో ఆయన్నే క్యూలో నిలబెట్టిన ఘనత మన కుటిల రాజకీయాలది అని గుర్‌బర్‌  సింగ్‌ తన బాధని వెళ్లగక్కారు. 1960 నుంచి 1970 వరకు క్రీడల వ్యవహారాలు నీచ రాజకీయాలతో మసకబారాయి. పాటియాలాలోని జాతీయ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఎస్‌), భారత హాకీ సమాఖ్యకు అప్పట్లో అసలు పొసిగేదే కాదు.

ఆ సమయంలో ధ్యాన్‌చంద్‌ ఎన్‌ఐఎస్‌ చీఫ్‌ కోచ్‌గా పని చేశారు. తన వద్ద శిక్షణ పొందిన ఆటగాళ్లు తదనంతరం అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడుతుండగా... అక్కడికి వెళ్లిన ధ్యాన్‌చంద్‌ను స్టేడియంలోకి అనుమతించలేదు. అయితే ధ్యాన్‌చంద్‌ మాత్రం తన కుర్రాళ్ల ప్రదర్శన చూడాలన్న తాపత్రయంతో ప్రతీ మ్యాచ్‌ కోసం క్యూలో నిలబడి టికెట్‌ కొనుక్కొని మరీ చూశారు. ఇది అత్యంత శోచనీయమని గుర్‌బక్ష  తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top