నా చుట్టూ మ్యాచ్‌ ఫిక్సర్లే: అక్తర్‌

Was Surrounded By Match Fixers Akhtar - Sakshi

కరాచీ: తాను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన సమయంలో పలువురు పాకిస్తాన్‌ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయంపై ఆ దేశ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ ఎట్టకేలకు మౌనం వీడాడు. తన చుట్టూ ఫిక్సర్లు ఉన్న విషయం తనకు తెలియకుండానే మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని అక్తర్‌ గుర్తు చేసుకున్నాడు. తానెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడక పోయినా, ఫిక్సింగ్‌తో పాకిస్తాన్‌ క్రికెట్‌ను మోసం చేయకపోయినా, మ్యాచ్‌ ఫిక్సర్స్‌తో క్రికెట్ ఆడటం మాత్రం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నాడు. మహ్మద్‌ అమిర్‌, అసిఫ్‌, సల్మాన్‌ భట్‌లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురి కావడం తన కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకం అని పేర్కొన్నాడు.

ఎవరైనా ప్రత్యర్థి జట్టుతో తలపడటాన్ని చూస్తాం.. కానీ చుట్టూ మన జట్టులోనే మ్యాచ్‌ ఫిక్సర్లే ఉన్నప్పుడు వారితో కూడా పోరాడాల్సి వచ్చిందా అనే విషయం తలుచుకుంటే బాధగా ఉందన్నాడు. ‘ నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా.. ఫిక్సింగ్‌ చేసి పాకిస్తాన్‌ క్రికెట్‌ను ఎప్పుడూ మోసం చేయలేదు. నా కెరీర్‌లోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనేది లేదు. కానీ నా చుట్టూ మ్యాచ్‌ ఫిక్సర్లే ఉన్నారు. నేను మొత్తం 22 మందికి వ్యతిరేకంగా క్రికెట్‌ ఆడా. అసలు మ్యాచ్‌ ఫిక్సర్‌ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడ్డ అసిఫ్‌ మొత్తం మ్యాచ్‌లన్నీ బుకీలు ఫిక్సింగ్‌ చేసినట్లు నాకు చెప్పాడు.

పాకిస్తాన్‌ తరఫున ఫిక్సింగ్‌ పాల్పడి నిషేధాన్ని కూడా ఎదుర్కొని మళ్లీ పాకిస్తాన్‌ జట్టు తరఫున రీ ఎంట్రీ ఇచ్చిన అమిర్‌ తలుచుకుంటే నాకు కోపం వస్తుంది. ఆమిర్‌ నన్ను చాలా గాయపరిచాడు. అమిర్‌, అసిఫ్‌లు ఎందుకు ఫిక్సింగ్‌ చేసారో నేను అర్ధం చేసుకోగలను. అమిర్‌, ఆసిఫ్‌లు ఫిక్సింగ్‌ చేశారనే అభియోగాలు విన్న మరక్షణం నేను చాలా నిరూత్సాహానికి గురయ్యా. వారి టాలెంట్‌ వృథా అయిపోందనుకున్నా. ఇద్దరు టాప్‌ బౌలర్లు ఇలా చేయడం బాధించింది. కొద్దిపాటి డబ్బుకు ఆశపడి ఇలా చేయడం జీర్ణించుకోలేకపోయాను’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకిబుల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తనను బుకీలు సంప్రదించినా ఆ విషయాన్ని దాటి పెట్టడంతో షకిబుల్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ క్రికెటర్ల స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం గురించి అక్తర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 2011లో అక్తర్‌ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. ఆ సమయంలోనే పాకిస్తాన్‌ క్రికెట్‌ను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top