వైరల్‌.. ఒకే బంతిని ఐదుసార్లు! | Sakshi
Sakshi News home page

బౌలింగ్‌ మరిచాడు.. కోచ్‌కి కాలింది

Published Mon, Oct 9 2017 9:46 AM

Wahab Riaz failure to deliver a ball five times  - Sakshi

సాక్షి, దుబాయ్‌ : ఓవైపు వరుస వైఫల్యాలు.. మరోవైపు ఆర్థిక కష్టాలు... పాకిస్థాన్‌ జట్టును కుదేలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దుబాయ్‌లో శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ను ఆడుతున్న పాక్‌ పేలవమైన ఫామ్‌నే కొనసాగిస్తోంది. అయితే రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో బౌలర్‌ వాహెబ్‌ రియాజ్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించి చరిత్ర కెక్కాడు. 

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం ఆటలో రియాజ్ ఈ ఫీట్ చేశాడు. 111వ ఓవర్‌ నాలుగో బంతిని వేసేందుకు యత్నించాడు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు.. ఐదు నిమిషాలపాటు ప్రయత్నించినా బంతిని వేయలేకపోయాడు. అవతల ఉన్న బ్యాట్స్‌మన్ కరుణరత్నెతోపాటు పాక్‌ కెప్టెన్‌ కమ్‌ కీపర్‌ సర్ఫాజ్‌ అహ్మద్‌, అంపైర్ కూడా విసుగుచెందడం కనిపించింది.

అదే సమయంలో కోచ్ మైక్ మిక్కీ అర్థర్ హవాభావాలను చూడాలి. చివరకు చిర్రెత్తుకొచ్చిన ఆయన మరో ఆటగాడితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైమ్‌ కాబోలు అని పలువురు చెబుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఆరోసారికి విజయవంతంగా బౌల్‌ చేయగలిగాడు. ఇక ఈ వీడియోతో ‘వాహెబ్‌ పాపం బౌలింగ్‌ మరిచిపోయాడేమో’ అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్‌ చేసి పడేస్తున్నారు.

Advertisement
Advertisement