షాను ఒంటరిగా వదిలేయండి : కోహ్లి

Virat Kohli Says Leave Prithvi Shaw Alone - Sakshi

హైదరాబాద్ ‌: టీమిండియా యువ సంచలనం పృథ్వీ షాను ఒంటరిగా వదిలేయాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విజ్ఞప్తి చేశాడు. ఇతర క్రికెటర్లతో పోల్చుతూ అతనిపై ఒత్తిడి నెలకోనేలా చేయవద్దని సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను కోహ్లి సమర్ధించాడు. హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘యువ ఆటగాడైన పృథ్వీ షాకు ఎదిగే సమయం ఇవ్వండి. అతను అద్భుత నైపుణ్యం గల ఆటగాడు. అతని సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరు చూశారు. షా గొప్పగా ఆడుతాడని మేం భావిస్తున్నాం. తొలి మ్యాచ్‌ ఆటను పునరావృతం చేస్తాడని నమ్ముతున్నాం. అతనో నిత్య విద్యార్థి. పరిస్థితులను చాలా అద్బుతంగా అర్థం చేసుకుంటాడు. అతని పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. మనం ఇప్పుడే అతన్ని ఎవరితో పొల్చొద్దు. అతని ఆటను ఆస్వాదిస్తూ ఆడే అవకాశం కల్పించాలి. అలా అయితే తన సహజశైలి ఆటతో ఎదుగుతాడు.

ఐపీఎల్‌, భారత్‌ ఏ పర్యటనలు, అండర్‌ 19 టోర్నీ లైవ్‌ కవరేజిలతో యువ ఆటగాళ్లకు వెలుగులోకి వస్తున్నారు. ఇవి వారిని ఒత్తిడి జయించేలా చేస్తున్నాయి. చాలా మంది ప్రేక్షకుల ముందు ఐపీఎల్‌ ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. షా, విహారీ ఇలానే అద్బుతంగా రాణించారు. వారి ఆటపట్ల వారు చాలా నమ్మకంగా ఉన్నారు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

రాజ్‌కోట్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పృథ్వీషా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించి విషయం తెలిసిందే. దీంతో అతని ఆటను సచిన్‌, సెహ్వాగ్‌లతో పోల్చుతూ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఇప్పుడే షాను దిగ్గజ క్రికెటర్లతో పోల్చవద్దని సౌరవ్‌ గంగూలీ, గంభీర్‌లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top