మా ముందున్న లక్ష్యం అదే : కోహ్లి

Virat Kohli Says Its By Product Of Quality Team After Test Captaincy Record - Sakshi

కింగ్‌స్టన్‌ : జట్టు సమిష్టి కృషి కారణంగానే కెప్టెన్‌గా తాను విజయవంతమయ్యానని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అన్నాడు. విజయాలను కొనసాగిస్తూ ముందుకు సాగడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 257 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతేగాకుండా విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో కోహ్లి అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ...‘ విజయవంతమైన టెస్ట్‌ కెప్టెన్‌గా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా షమీ, ఇషాంత్‌, జడేజా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. నిజానికి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మన పేరుకు ముందు ‘సీ’ అనే కొత్త అక్షరం చేరుతుందే గానీ పెద్దగా మార్పు ఏమీ ఉండదు. జట్టు రాణించకపోతే కెప్టెన్‌ ఒక్కడే విజయాలు సాధించలేడు కదా. మరిన్ని విజయాలు సాధించడమే మా ముందున్న లక్ష్యం’ అని వ్యాఖ్యానించాడు.

చదవండి : కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు

ఈ క్రమంలో రెండో టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తెలుగు యువ క్రికెటర్‌ హనుమ విహారిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ‘ ఈ మ్యాచ్‌లో హనుమ విహారీ స్టాండ్‌ అవుట్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. తను అంకితభావం గల ఆటగాడు. ఈరోజు టాప్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తను క్రీజులో ఉన్నపుడు డ్రెస్సింగ్‌లో అంతా నిశ్శబ్ధంగా ఉండి తన ఆటపై దృష్టి సారిస్తారు. తను సహజంగానే మనసు పెట్టి ఆడతాడు. జట్టు విజయం కోసం పరితపిస్తాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. జట్టులోకి ఎంపిక చేసిన నిర్ణయానికి ఈరోజు తన ఆటతో సమాధానం చెప్పాడు’ అని విహారిని ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా విండీస్‌ను మట్టి కరిపించిన కోహ్లి సేన కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించింది. అదే విధంగా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత బౌలర్లు మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు తీసి తీయగా.. ఇషాంత్‌ శర్మకు రెండు, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. కాగా రోహిత్‌ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న కోహ్లి నిర్ణయానికి సమర్థింపుగా.. సెంచరీ, అర్ధసెంచరీతో విహారీ సత్తా చాటాడు. తద్వారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు.

చదవండి : టీమిండియా భారీ గెలుపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top