
ప్రతి రోజూ ఓ కొత్త రోజే: కోహ్లి
ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడాలన్న బలమైన కోరికే తనకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.....
న్యూఢిల్లీ: ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడాలన్న బలమైన కోరికే తనకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ప్రతి రోజూ ఓ కొత్త రోజే. ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడటానికి అవకాశం ఉందని భావిస్తా. కష్టపడటానికి, క్రమశిక్షణకు ప్రత్యామ్నాయం లేదు’ అని కోహ్లి పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో నిలకడగా రాణించడంపై మాట్లాడుతూ... ‘అందరు క్రికెటర్లలాగే నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటా. అయితే జట్టులో స్థానంపై అభద్రతభావం ఏర్పడితే ఆ నిరాశలో తప్పులు చేస్తాం. కానీ బాగా ఆడాలని బలంగా కోరుకుంటే మాత్రం మైదానం లోపలా, బయటా ఒకే రకమైన దూకుడు చూపెట్టాలి. సమయం గడుస్తున్నకొద్ది మనం కుదురుకోవడంతో పాటు ఆటలోనూ నిలకడ వస్తుంది’ అని వ్యాఖ్యానించాడు.