
కోహ్లి కసిగా...
భుజం గాయంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం పెవిలియన్‌కే పరిమితమైన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే జట్టును
భుజం గాయంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం పెవిలియన్‌కే పరిమితమైన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే జట్టును నడిపించాడు. అతను మైదానంలో ఉంటే జట్టులో ఉండే ఉత్సాహమే వేరు. జడేజా బౌలింగ్‌లో వార్నర్ బౌల్డ్ కాగానే విరాట్ తన కసినంతా ప్రదర్శించాడు. గాయమైన తన కుడి భుజంపై చేయి వేసి చూపిస్తూ ఆవేశంగా అరిచాడు. మూడో రోజు తనను వ్యంగ్యంగా అనుకరించిన మ్యాక్స్‌వెల్‌కు ఈ రకంగా అతను బదులిచ్చాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత్ దూసుకుపోతుండటంతో ఒక దశలో హాజల్‌వుడ్ స్లెడ్జింగ్‌కు కూడా దిగాడు. అయితే పుజారా చాలా ప్రశాంతంగా ‘వెళ్లి స్కోరు బోర్డు చూసుకో’ అని ఒకే మాటలో జవాబిచ్చేశాడు.
భారత్ 4, ఆసీస్ 0
సిరీస్ ఆరంభం నుంచి భారత్‌కు కలిసిరాని డీఆర్‌ఎస్ నాలుగో రోజు మాత్రం బాగా అచ్చివచ్చింది. ఏకంగా నాలుగు సార్లు రివ్యూ భారత్‌కు అనుకూలంగా రావడం విశేషం. ఇందులో రెండు సార్లు భారత్ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందగా, మరో రెండు సార్లు ఆసీస్ రివ్యూ చేసి భంగపడింది. ఆటలో మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. పుజారా 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం హాజల్‌వుడ్ అప్పీల్ చేశాడు.
అవుట్‌గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ క్రిస్ గఫానీ తన వేలు చాలా వరకు పైకెత్తారు. అయితే ఆసీస్ ఆటగాళ్ల అప్పీల్‌లో పెద్దగా బలం లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దాంతో ఒక్కసారిగా ఆలోచన మార్చుకొని చేతిని తన నెత్తి మీదికి పోనిచ్చి హ్యాట్‌ను సవరించుకోవడం విశేషం!