‘బెస్ట్‌ బాక్సర్‌’గా వికాస్‌ కృషన్‌  | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌ బాక్సర్‌’గా వికాస్‌ కృషన్‌ 

Published Tue, Feb 27 2018 1:10 AM

Vikas Krishnan is the best boxer - Sakshi

సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ వికాస్‌ కృషన్‌ ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్‌ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్‌ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక వికాస్‌ ఖాతాలో చేరిన మరో పతకం ఇదే.

‘నాకిది గొప్ప పునరాగమనం. గతంలో నా కచ్చితమైన బరువును నియంత్రించుకునేందుకు ఇబ్బంది పడేవాణ్ని. ప్రస్తుతం ఆ సమస్య లేదు. నా టెక్నిక్‌ కూడా మెరుగయింది. మానసికంగా కూడా నేను దృఢంగా మారాను’ అని వికాస్‌ తెలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను గెల్చుకున్నారు.
 

Advertisement
Advertisement