క్వార్టర్స్‌లో ఆంధ్ర

Vijay Hazare is one day tournament :Ap beat Madhya Pradesh - Sakshi

చివరి లీగ్‌ మ్యాచ్‌లో  మధ్యప్రదేశ్‌పై గెలుపు

విజయ్‌ హజారే వన్డే టోర్నీ

ఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆంధ్ర క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం ఇక్కడ జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ఆ జట్టు 7 వికెట్లతో గెలుపొందింది. దీంతో హైదరాబాద్‌ (22 పాయింట్లు)ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశలో ఈ జట్టు 8 మ్యాచ్‌లకు గాను 6 గెలిచి, ఒకదాంట్లో ఓడింది. మరోదాంట్లో ఫలితం తేలలేదు. టోర్నీలో తదుపరి దశకు వెళ్లాలంటే గెలుపు తప్పనిసరైన మ్యాచ్‌లో ఆంధ్ర సులువుగానే నెగ్గింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మధ్యప్రదేశ్‌... ఆఫ్‌ స్పిన్నర్లు షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (4/16), హనుమ విహారి (3/31)ధాటికి 41.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. ఆనంద్‌సింగ్‌ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు) మాత్రమే రాణించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒక దశలో 53/3తో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్‌ రికీ భుయ్‌ (74 బంతుల్లో 56 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బి.సుమంత్‌ (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌)అజేయ ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. నాలుగో వికెట్‌కు వీరు 103 పరుగులు జోడించారు. దీంతో 34.3 ఓవర్లలోనే జట్టు లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా టెస్టు జట్టులో ఉన్న హనుమ విహారిని బీసీసీఐ రిలీవ్‌ చేయడంతో అతడు విజయ్‌ హజారే మ్యాచ్‌ ఆడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top