అయ్యో... కెర్బర్‌ | Top-ranked Angelique Kerber upset in first round of French Open | Sakshi
Sakshi News home page

అయ్యో... కెర్బర్‌

May 29 2017 1:40 AM | Updated on Sep 5 2017 12:13 PM

అయ్యో... కెర్బర్‌

అయ్యో... కెర్బర్‌

టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పెను సంచలనంతో ప్రారంభమైంది.

► తొలి రౌండ్‌లోనే ఓడిన టాప్‌ సీడ్‌
► మకరోవా అద్భుత ప్రదర్శన


పారిస్‌: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పెను సంచలనంతో ప్రారంభమైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ క్రీడాకారిణి ఎంజెలిక్‌ కెర్బర్‌ ఊహించనిరీతిలో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. రష్యా అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ ఎకతెరీనా మకరోవా అద్వితీయ ఆటతీరుకు కెర్బర్‌ చేతులెత్తేసింది. ఈ క్రమంలో టాప్‌ సీడ్‌ హోదాలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన మొదటి క్రీడాకారిణిగా కెర్బర్‌ గుర్తింపు పొందింది.

గతంలో టాప్‌ సీడ్‌ హోదాలో హెనిన్‌ (బెల్జియం) 2004లో, సెరెనా (అమెరికా) 2014లో రెండో రౌండ్‌లో వెనుదిరిగారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ మకరోవా 6–2, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే టాప్‌ సీడ్‌ క్రీడాకారిణిని ఓడించిన తొలి ప్లేయర్‌గా నేను చరిత్ర సృష్టించానన్న విషయం తెలియగానే నమ్మలేకపోయాను’ అని మకరోవా వ్యాఖ్యానించింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మకరోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. 27 విన్నర్స్‌ కొట్టిన ఆమె, నెట్‌ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది.

గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన కెర్బర్‌కు ఈ ఏడాది కలిసి రావడంలేదు. తాజా సీజన్‌లో ఆమె 19 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. మరోవైపు కెర్బర్‌కు ముందు నాలుగుసార్లు మాత్రమే టాప్‌ సీడ్‌ క్రీడాకారిణులు ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోవడం జరిగింది. గతంలో టాప్‌ సీడ్‌ హోదాలో రుజుకి (1979 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో), స్టెఫీ గ్రాఫ్‌ (1994 వింబుల్డన్‌లో), మార్టినా హింగిస్‌ (1999, 2001 వింబుల్డన్‌లో) తొలి రౌండ్‌లో ఓడిపోయారు.

ఆకట్టుకున్న క్విటోవా: గత డిసెంబరులో తన ఇంట్లో ఆగంతకుడి కత్తి దాడిలో చేతికి గాయమై ఆటకు దూరమైన పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పునరాగమనం చేసింది. తొలి రౌండ్‌లో క్విటోవా 6–3, 6–2తో జూలియా బోసెరప్‌ (అమెరికా)పై అలవోకగా గెలిచి శుభారంభం చేసింది. ‘గత వారంలోనే నేను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని క్విటోవా వ్యాఖ్యానించింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌  కుజ్‌నెత్సోవా (రష్యా) 7–5, 6–4తో మెక్‌హాలె (అమెరికా)పై పదో సీడ్‌ వీనస్‌ (అమెరికా) 6–4, 7–6 (7/3)తో కియాంగ్‌ (చైనా)పై గెలిచారు.

థీమ్‌ శుభారంభం: పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో టామిక్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. 11వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–2, 6–3, 6–4తో రాబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, 23వ సీడ్‌ కార్లోవిచ్‌ (క్రొయేషియా) 7–6 (7/5), 7–5, 6–4తో సిట్‌సిపాస్‌ (గ్రీస్‌)పై గెలుపొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement