అల్‌కరాజ్‌ అదరహో | Carlos Alcaraz retains French Open mens singles title | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌ అదరహో

Jun 9 2025 1:45 AM | Updated on Jun 9 2025 7:28 AM

Carlos Alcaraz retains French Open mens singles title

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న స్పెయిన్‌ స్టార్‌

ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌పై అద్భుత విజయం 

రూ. 24 కోట్ల 91 లక్షల ప్రైజ్‌మనీ సొంతం 

5 గంటల 29 నిమిషాల తుది పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌దే పైచేయి 

పారిస్‌: ఊహకందని మలుపులతో సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ అల్‌కరాజ్‌ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు. 

5 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అల్‌కరాజ్‌ తొలి రెండు సెట్‌లను చేజార్చుకున్నా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్‌లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్‌లో అల్‌కరాజ్‌ ఏకంగా మూడు మ్యాచ్‌ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ తన కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 

చాంపియన్‌గా నిలిచిన అల్‌కరాజ్‌కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్‌ సినెర్‌కు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అల్‌కరాజ్‌ ఆడిన ఐదు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లోనూ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు అల్‌కరాజ్‌ 2025, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌... 2023, 2024 వింబుల్డన్‌... 2022 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో టైటిల్స్‌ సాధించాడు.  

కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ ఆడిన సినెర్‌ తొలి రెండు సెట్‌లను సొంతం చేసుకొని టైటిల్‌ దిశగా సాగిపోయాడు. అయితే అల్‌కరాజ్‌ పట్టువీడలేదు. మూడో సెట్‌ నుంచి అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడో సెట్‌లోని నాలుగో గేమ్‌లో, పదో గేమ్‌లో సినెర్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ సెట్‌ను 6–4తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నాలుగో సెట్‌లో అల్‌కరాజ్‌ టైబ్రేక్‌లో పైచేయి సాధించాడు. 

నిర్ణాయక ఐదో సెట్‌లో ఒకదశలో అల్‌కరాజ్‌ 5–4తో గెలుపు అంచులో నిలిచాడు. అయితే సినెర్‌ పదో గేమ్‌లో అల్‌కరాజ్‌  సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో చివరి సెట్‌లోనూ టైబ్రేక్‌ అనివార్యమైంది. ముందుగా 10 పాయింట్లు సాధించిన అల్‌కరాజ్‌ సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement