హోరాహోరీ పోరు జరగాలని... | The Indian team is hoping to get stronger in the one-day series against Sri Lanka, | Sakshi
Sakshi News home page

హోరాహోరీ పోరు జరగాలని...

Aug 20 2017 1:29 AM | Updated on Sep 12 2017 12:30 AM

టెస్టు మ్యాచ్‌ల్లో అలవోకగా ఓడిన శ్రీలంక జట్టు నుంచి వన్డేల్లో మాత్రం గట్టిపోటీ లభిస్తుందని భారత జట్టు భావిస్తోంది.

సునీల్‌ గావస్కర్‌

టెస్టు మ్యాచ్‌ల్లో అలవోకగా ఓడిన శ్రీలంక జట్టు నుంచి వన్డేల్లో మాత్రం గట్టిపోటీ లభిస్తుందని భారత జట్టు భావిస్తోంది. తెల్ల బంతులతో బౌలర్లకు మ్యాచ్‌ ఆరంభంలో మినహా మిగతా ఓవర్లలో అంత మద్దతు ఉండే అవకాశాలు లేవు. ఫలితంగా బౌలర్లు వికెట్లు తీయడంకంటే పరుగులను నియంత్రంచడంపైనే దృష్టి సారిస్తారు. కెప్టెన్లు కూడా బౌలర్ల సూచనలకు అనుగుణంగా ఫీల్డింగ్‌ను పెడతారు.

కఠిన నిబంధనల కారణంగా బౌలర్లు ఎక్కువ బౌన్సర్లు వేయడానికి కూడా వెనుకాడతారు. ఈ అంశాలన్నీ టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే విభిన్న వ్యూహాలతో వన్డేల్లో ఆడాల్సి ఉంటుందని సూచిస్తాయి. బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో గురి తప్పిన షాట్‌లు కూడా సిక్సర్లుగా వెళతాయి. వన్డేల్లో బ్యాట్స్‌మన్‌ వికెట్లకు దూరంగా జరిగి పేస్‌ బౌలింగ్‌లో షాట్‌లు ఆడినా ఎవరూ ఏమీ అనరు. అదే టెస్టుల్లో ఇలా చేస్తే మాత్రం పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకే ఆ బ్యాట్స్‌మన్‌ పక్కకు జరిగి ఆడాడని విమర్శలు చేస్తారు.

భారత్‌తో చివరిసారి చాంపియన్స్‌ ట్రోఫీలో వన్డే ఆడినపుడు శ్రీలంక 320 పరుగులకంటే ఎక్కువ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి అధిగమించి అద్భుత విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ స్ఫూర్తితో వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని లంక జట్టు భావిస్తోంది. టెస్టు సిరీస్‌తో పోలిస్తే వన్డే సిరీస్‌లో టీమిండియా పలు బౌలింగ్‌ మార్పులతో బరిలోకి దిగనుంది. అనుభవజ్ఞుడైన జస్‌ప్రీత్‌ బుమ్రాతోపాటు ఇతర బౌలర్లపై భారత్‌ ఆధారపడాల్సి ఉంటుంది. మళ్లీ భారత బ్యాట్స్‌మెన్‌ నుంచి భారీగా పరుగులు రావాల్సిన అవసరం ఉంది.

టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన లోకేశ్‌ రాహుల్‌ వన్డేల్లో నాలుగో నంబర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని సెలక్టర్లు తెలిపారు. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఏమైనా చేయాలంటే కెప్టెన్‌ కోహ్లి ఆలోచించాలి. ఉదాహరణకు టాప్‌–3 బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా ఆడాక చివరి ఆరు ఓవర్లు మిగిలినపుడు అవుటైతే రాహుల్‌ను పంపించాలా? ధోనిని పంపించాలా? అనే విషయం కోహ్లి తేల్చుకోవాలి. రెండో వికెట్‌ పడ్డాక ఎవరు రావాలనే విషయంపై కోహ్లి నిర్ణయం తీసుకుంటాడా లేక చీఫ్‌ సెలక్టర్‌ ఆదేశాలను పాటిస్తాడా వేచి చూడాలి. మొత్తానికి టెస్టు సిరీస్‌ మాదిరిగా ఏకపక్షం కాకుండా వన్డే సిరీస్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాలని కోరుకుంటున్నాను. టెస్టు సిరీస్‌లోనైతే లంక అన్ని విభాగాల్లో తేలిపోయింది. వన్డే సిరీస్‌లో ఎలా ఆడతారో చూడాలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement