రజతమే బంగారం! | the Champions Trophy Runner-up India shootout , losing to Australia | Sakshi
Sakshi News home page

రజతమే బంగారం!

Jun 19 2016 12:07 AM | Updated on Sep 4 2017 2:49 AM

రజతమే బంగారం!

రజతమే బంగారం!

స్టార్ క్రీడాకారులు లేకపోయినా... అంచనాలకు మించి రాణించిన భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో తమ.......

చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్ భారత్  షూటౌట్‌లో ఆసీస్ చేతిలో పరాజయం
నిర్ణీత సమయంలో గోల్ ఇవ్వని టీమిండియా  తొలిసారి రజత పతకం కైవసం

 
లండన్: స్టార్ క్రీడాకారులు లేకపోయినా... అంచనాలకు మించి రాణించిన భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. 38 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు రజత పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా భారత్‌కిది ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రెండో పతకం. గతంలో భారత్ 1982లో ఏకైకసారి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.


భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో... టీమిండియా పెనాల్టీ షూటౌట్‌లో 1-3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా రికార్డుస్థాయిలో 14వసారి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.  లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఫైనల్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. రెండో క్వార్టర్‌లో ఆస్ట్రేలియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించినా ఆ జట్టు దానిని వృథా చేసుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేసేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ముఖ్యంగా భారత గోల్‌కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శన చేసి పలుమార్లు ఆసీస్ దాడులను సమర్థంగా నిలువరించాడు. మన్‌దీప్, ఆకాశ్‌దీప్, సునీల్, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్ సింగ్, నికిన్ తిమ్మయ్య అవకాశం దొరికినపుడల్లా ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండు జట్లకు కలిపి 19 పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా ఒక్క జట్టు కూడా గోల్ చేయలేకపోయింది.  నిర్ణీత సమయంలోపు గోల్స్ నమోదు కాకపోవడంతో ఫలితాన్ని నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.


 భారత్ నిరసన...
పెనాల్టీ షూటౌట్‌లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కడే గోల్ చేయగా... ఎస్‌కే ఉతప్ప, ఎస్‌వీ సునీల్, సురేందర్ కుమార్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఆరన్ జలెవ్‌స్కీ, డానియల్ బేల్, సిమోన్ ఆర్చిడ్ సఫలంకాగా... ట్రెంట్ మిటన్ షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో ఐదో స్ట్రోక్‌ను తీసుకోలేదు. షూటౌట్‌లో భాగంగా డానియల్ బేల్ తొలి ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకున్నాడు. అయితే ఆసీస్ బృందం సమీక్షకు వెళ్లింది. రిప్లేను పరిశీలించాక టీవీ అంపైర్ షాట్‌ను మళ్లీ తీసుకోవాలని తెలిపారు. ఈసారి బేల్ గోల్ చేశాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రెండో షాట్ సందర్భంగా అంపైర్ తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది. నిర్వాహకులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దాంతో నిర్వాహకులు తుది ఫలితాన్ని గంటపాటు వాయిదా వేశారు. పలుమార్లు వీడియోను పరిశీలించాక అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని స్పష్టం చేసిన జ్యూరీ కమిటీ ఆస్ట్రేలియాను అధికారికంగా విజేతగా ప్రకటించింది.


 హాకీ ఇండియా నజరానా
 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి రజత పతకం నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) నజరానా ప్రకటించింది. చీఫ్ కోచ్‌తోపాటు జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల చొప్పున... మిగతా సహాయక సిబ్బందికి రూ. లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని హెచ్‌ఐ అధ్యక్షుడు నరేందర్ బాత్రా ప్రకటించారు. ‘యూత్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ పురస్కారం అందుకున్న భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్‌కు అదనంగా మరో లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.

జట్టుపై ప్రశంసల జల్లు
చాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అభినందించారు. ‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరిచిన భారత జట్టుకు అభినందనలు. మీ ప్రయత్నం అద్భుతం. మీ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత మేటి క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, భారత హాకీ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా టీమిండియా ప్రదర్శనను ప్రశంసించారు.
 
1 ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 116 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్ నిర్ణీత సమయంలోపు ఆస్ట్రేలియాకు గోల్ సమర్పించుకోకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 
►  4 భారత జట్టు 11 సార్లు ఫైనల్స్‌లో షూటౌట్‌ను ఎదుర్కొంది. ఏడుసార్లు సఫలంకాగా, నాలుగుసార్లు విఫలమైంది.
 
 షూటౌట్ సాగిందిలా...
 
భారత్   x       స్కోరు         ఆస్ట్రేలియా
ఉతప్ప   x       0-1            జలెవ్‌స్కీ
సురేందర్   x     0-2          బేల్3
హర్మన్‌ప్రీత్3      1-2          మిటన్ x
 సునీల్ x           1-3           ఆర్చిడ్ 3

 

Advertisement
 
Advertisement
Advertisement