నాడు మారధాన్‌ విన్నర్‌...నేడు టీ కొట్టు ఓనరు

Tamil Nadu Lady Won Gold Medal Now She Runs Tea Stall - Sakshi

కోయంబత్తూర్‌ : పరుగు అంటే ఆమెకు ప్రాణం. లేడిని మించిన వేగం ఆమెది. పరుగు పందెంలో నాలగు బంగారు పతకాలు గెలిచింది. ప్రభుత్వం మెచ్చి, ఏదైనా ఉపాధి చూపిస్తుంది అనుకుంది. కానీ నిరాశే ఎదురయ్యింది. పరుగు పందెంలో గెలిచిన ఆమెను పేదరికం ఓడించింది. చేసేదేమిలేక కుటుంబపోషణ నిమిత్తం ప్రస్తుతం టీ కొట్టు పెట్టుకుని బతుకు బండిని లాక్కొస్తోంది. ఆమే తమిళనాడుకు చెందిన కళైమణి. కోయంబత్తూరుకు చెందిన కళైమణి (45) రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. పదవ తరగతి వరకు చదువుకున్న కళైమణికి చిన్నతనం నుంచి క్రీడలంటే ఆసక్తి. పాఠశాలలో కబడ్డీ, మిగితా క్రీడల్లో పాల్గొనేది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి 41కి.మీ. మరాథన్‌లో బంగారు పతకాలు సాధించింది. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడంతో వివాహం చేసుకుని క్రీడలకు దూరమయ్యింది.

ప్రస్తుతం ముగ్గురు పిల్లల బాధ్యత చూసుకోవడం కోసం భర్తకు సహాయంగా ఒక చిన్న టీ కొట్టు నడుపుతుంది. టీ కొట్టు మీద రోజుకు రూ.400 - 500 వరకు సంపాదిస్తుంది. ఇప్పటికి పరుగు మీద ఇష్టాన్ని వదులుకోలేక ప్రతిరోజు 21కి.మీ దూరం పరిగెత్తుతు సాధన కొనసాగిస్తుంది. పూర్తిస్థాయిలో పరుగు మీద దృష్టి పెట్టడానికి, మెరుగైన సదుపాయల కల్పన కోసం రుణం ఇవ్వమని బ్యాంకులను ఆశ్రయించింది. కానీ బ్యాంకులు అప్పు ఇవ్వడానికి నిరాకరించడంతో స్నేహితుల వద్ద నుంచి ఆర్థిక సహాయం తీసుకుని సాధన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏదైన సహాయం చేస్తే తనలాంటి మరికొంత మందికి శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top