జాతీయ హాకీ జట్టు... అండగా రాష్ట్ర ప్రభుత్వం 

 support the government of the state of the national hockey team - Sakshi

భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనున్న ఒడిశా 

న్యూఢిల్లీ: ప్రముఖ కంపెనీలు, వ్యాపార దిగ్గజ సంస్థలు క్రీడల జట్లకు స్పాన్సర్లుగా వ్యవహరించడం సర్వసాధారణం. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేస్తే అది గొప్ప విశేషం. ఆనవాయితీకి భిన్నంగా ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌షిప్‌ అందించనుంది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. గురువారం ఇక్కడ ఘనంగా నిర్వహించిన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు భారత పురుషులు, మహిళా జట్ల సభ్యులు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌), ఐఓఏ అధ్యక్షుడు కూడా అయిన నరీందర్‌ బాత్రా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు.

ఈ సం దర్భంగా ఒడిశా సీఎం మాట్లాడుతూ ‘మా రాష్ట్రంలో హాకీ ఆట కాదు... ఆటకంటే ఎక్కువే. ఇది మా జీవితంలో భాగమైపోయింది. ఇక్కడి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా చిన్నారులు బంతి, కర్రల సాయంతో హాకీని ఆడతారు. దిలీప్‌ టిర్కీ, ఇగ్నీస్‌ టిర్కీ, లాజరస్‌ బార్లాలాంటి మేటి ఆటగాళ్లు ఒడిశా నుంచే వచ్చారు. ఇప్పుడు ఈ క్రీడ ఉన్నతి కోసం మేం పాటు పడతాం. హాకీ ఇండియా (హెచ్‌ఐ)తో కలిసి పనిచేస్తాం. ఇది భారత హాకీకి ఒడిశా ప్రభుత్వం ఇచ్చే కానుక’ అని అన్నారు.  2014 చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 16 వరకు ప్రపంచ కప్‌ టోర్నీ జరగనుండటం విశేషం.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top