
కింగ్స్ ను సన్ రైజర్స్ నిలువరించేనా?
పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 7లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టు. సాదాసీదాగా టోర్నీని ఆరంభించి ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ అయ్యింది.
షార్జా: పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 7లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టు. సాదాసీదాగా టోర్నీని ఆరంభించి ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ అయ్యింది. టోర్నీ ఆదిలో ఉండగానే టైటిల్ ఫేవరెట్ అనడం విడ్డూరం అనిపించిన జట్టుకు లభించిన రెండు విజయాలతో పంజాబ్ ను ఫేవరెట్ గానే పరిగణించాలి. చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన రెండొందల పైచిలుకు లక్ష్యాన్ని అవలీలగా ఊదిపడేసినా పంజాబ్.. అనంతరం రాజస్థాన్ పై కూడా దాదాపు అదే విజయాన్ని అందుకుని అవతలి జట్లకు వణుకు పుట్టిస్తోంది. ఈ రెండు విజయాల్లో మ్యాక్స్ వెల్, మిల్లర్ ల అద్భుత ఇన్నింగ్సే ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఇద్దరు ఆడుతున్న తీరును చూస్తే ప్రతీజట్టు పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాల్సిందే. ప్రత్యేకంగా వీరికి తగిన వ్యూహ రచన చేయకుండా బరిలోకి వస్తే మాత్రం ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఈ తరుణంలో బ్యాటింగ్ లో బలంగా ఉన్న సన్ రైజర్స్ రేపటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో పోరుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం పంజాబ్ ను ఓడించాలంటే సన్ రైజర్స్ కు శ్రమటోడ్చక తప్పదు. ఇప్పటికే ఓటమితో ఇన్నింగ్స్ ఆరంభించిన సన్ రైజర్స్ జట్టులో ఓపెనర్లు శుభారంభం ఇస్తున్నా ఆ జట్టు నిలకడలేమి వారిని కంగారు పెట్టిస్తోంది. శిఖర ధావన్, డేవిడ్ వార్నర్ లు ఇచ్చే ఆరంభాన్ని జట్టు ఉపయోగించుకుంటే మాత్రం అసలు సిసలు సమరం ఇరుజట్ల మధ్య జరిగే అవకాశం ఉంది. జట్టులో డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు రాణిస్తే మాత్రం పంజాబ్ కు కష్టాలు తప్పవు.
తొలి సారే సన్‌రైజర్స్ హైదరాబాద్ చక్కటి ప్రదర్శన కనబర్చిందని, ఈ సారి తాము మరింత మెరుగైన క్రికెట్ ఆడతామని ఆ జట్టు కోచ్ టామ్ మూడీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ధాటిగా ఆడే హిట్టర్ల రాకతో తమ జట్టులో ఉండటం తమ జట్టుకు కలిసొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మూడీతో పాటు జట్టు మెంటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్ లు సన్ రైజర్స్ కలవడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. టీంను విజయాల బాట పట్టించడానికి ఈ ముగ్గురు యోధుల కృషి ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.