స్మిత్‌ సూపర్‌ డబుల్‌

Steve Smith hits 3rd Ashes double century - Sakshi

ద్విశతకంతో అదరగొట్టిన మాజీ కెప్టెన్‌

రాణించిన పైన్, స్టార్క్‌; ఆసీస్‌ 497/8 డిక్లేర్డ్‌

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను తక్కువ స్కోరుకే ఔట్‌ చేయడం ఇక ఇంగ్లండ్‌ బౌలర్ల తరం కాదేమో? ఔను మరి...! ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం లొంగని విధంగా ఆడుతున్నాడతను. తనంతట తాను వికెట్‌ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు. స్మిత్‌ అద్భుత ఆటతో డబుల్‌ సెంచరీ బాదడంతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 170/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్‌... స్మిత్‌కు తోడు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (127 బంతుల్లో 58; 8 ఫోర్లు), లోయరార్డర్‌లో మిచెల్‌ స్టార్క్‌ (58 బంతుల్లో 54 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు అందుకుంది. అంతకుముందు హెడ్‌ (19), వేడ్‌ (16) త్వరగానే వెనుదిరిగినా స్మిత్‌... పైన్‌తో ఆరో వికెట్‌కు 145 పరుగులు; 8వ వికెట్‌కు స్టార్క్‌తో కలిసి 51 పరుగులు జోడించి జట్టును నిలిపాడు. ఈ క్రమంలో 160 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 118 పరుగుల వద్ద స్పిన్నర్‌ లీచ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చినా అది నోబాల్‌ కావడంతో అతడికి లైఫ్‌ లభించింది.

దీనిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో మూడో ద్విశతకం (310 బంతుల్లో) సాధించాడు. అనంతరం సైతం సాధికారికంగా కనిపించిన అతడు... పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌నకు యత్నించి ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్‌ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా స్టార్క్‌ బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. 49 బంతుల్లోనే వీరు 59 పరుగులు జోడించారు. ఆసీస్‌ చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు చేయడం విశేషం. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ రోజు ముగిసేసరికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top