భారత హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
ఇపో(మలేసియా): ఆసియా కప్ ఫైనల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లోనూ గెలిచి సూపర్ ఫాంలో ఉన్న టీమిండియాకు ఫైనల్లో మాత్రం పరాభవం ఎదురైంది. ఆదివారం పటిష్టమైన దక్షిణకొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ చతికిలబడింది. దక్షిణకొరియా అటాకింగ్ ను నిలువరించడంలో విఫలమైన భారత్ 3-4 తేడాతో ఓటమి పాలైంది. లీగ్ దశలో కొరియా ఆటగాళ్లను నిలువరించిన భారత్.. ఫైనల్ ఫోబియా అదిగమించడంలో మాత్రం విఫలమై భారంగా స్వదేశానికి పయనం కానుంది. వరుస మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ ట్రోఫీని తీసుకువస్తారని భావించిన భారత అభిమానులు నిరాశ చెందక తప్పలేదు.
2007 చెన్నైలో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి ఆ తర్వాత ఘోరంగా విఫలమైన భారత జట్టు పరిస్థితి తిరిగి గాడిలో పడింది. గతేడాది టోర్నీలో ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు ఈసారి కప్ గెలిచే సువర్ణావకాశం దక్కినా రన్నరప్ గానే సరిపెట్టుకున్నారు. కాగా, టోర్నీలో కుర్రాళ్ల పెద్దగా అనుభవం లేకున్నా నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకోవడం విశేషం. గత మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రపంచకప్ టోర్నమెంట్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.