
గ్లోబల్ టీ20 లీగ్‌లో స్టీవ్ స్మిత్
అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగానే..
కాన్‌బెర్రా : బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన విషయం తెలిసిందే. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగానే.. గ్లోబల్ టీ20(కెనడా) లీగ్‌లో టొరంటో నేషనల్స్ తరపున బరిలోకి దిగాడు. నిషేధం తర్వాత తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టిన స్మిత్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు కూడా. ఈ నేపథ్యంలో మరో టీ20 లీగ్‌లోనూ సత్తా చాటేందుకు స్మిత్ సిద్ధమయ్యాడు. ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బార్బడోస్ ట్రెడెంట్స్‌కు స్మిత్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు సదరు ఫ్రాంచైజీ తెలిపింది.
షకీబ్ స్థానంలో స్మిత్..
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమవడంతో అతని స్థానంలో స్మిత్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు ట్రెడెంట్స్ జట్టు కోచ్ రాబిన్ సింగ్ తెలిపాడు. స్మిత్ రాకతో బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుందని, వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. ట్రెడెంట్స్ జట్టు విజయాల్లో స్మిత్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ట్రెడెంట్స్ జట్టు ఆగస్టు 12న గయానా అమెజాన్ వారియర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.