ఎన్‌బీఏపై కరోనా పంజా 

Sixteen NBA Players Tested Positive Of Coronavirus - Sakshi

16 మంది ప్లేయర్లకు కోవిడ్‌ పాజిటివ్‌

వచ్చే నెల 30న లీగ్‌ పునఃప్రారంభం

వాషింగ్టన్‌: కరోనా విజృంభణతో అర్ధాంతరంగా నిలిచిపోయిన అమెరికా విఖ్యాత ‘నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ 2019–20 సీజన్‌ను జూలై 30న పునఃప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న నిర్వాహకులకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. లీగ్‌లోని వివిధ జట్లకు ఆడుతున్న 16 మంది ప్లేయర్లకు కరోనా సోకినట్లు ఎన్‌బీఏ లీగ్‌ కమిషనర్‌ ఆడమ్‌ సిల్వర్‌ ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. 302 మంది ప్లేయర్ల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా... 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వీరిని స్వీయ నిర్భందంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సిల్వర్‌ తెలిపారు.

గత బుధవారమే శాక్రమెంటో జట్టు ఆటగాళ్లు జాబ్రీ పార్కర్, అలెక్స్‌ లెనాలతో పాటు ఇండియానా పేసర్స్‌ ఆటగాడు మాల్కమ్‌ బ్రాగ్‌డాన్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే తాము సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు సిల్వర్‌ స్పష్టం చేశారు. రీ స్టార్ట్‌ సీజన్‌లో 30 జట్లకు బదులు 22 జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. వీటిని వెస్ట్రన్‌ కాన్ఫరెన్స్, ఈస్ట్రన్‌ కాన్ఫరెన్స్‌ గ్రూపులుగా విడగొడతారు. ప్రతి జట్టు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడతాయి. అనంతరం ప్రతి గ్రూప్‌ నుంచి ఎనిమిది జట్ల చొప్పున 16 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆగస్టు 17 నుంచి ఆరంభం కానుండగా... ఫైనల్స్‌ సెప్టెంబర్‌ 30న మొదలవుతాయి. ఫైనల్స్‌ను ‘బెస్ట్‌ ఆఫ్‌ సెవెన్‌’ (ఏడు మ్యాచ్‌లు) పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లన్నింటిని ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్‌లో నిర్వహిస్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top