టీ20 చరిత్రలో మూడో ఆటగాడిగా..

Shoaib Malik third batsman to score 2000 T20I runs - Sakshi

హరారే: పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ 20 చరిత్రలో రెండు వేల పరుగుల మార్కును దాటిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ట్రై సిరీస్‌లో భాగంగా జింబాబ‍్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాలిక్‌ 24 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో పొట్టి ఫార్మాట్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకూ టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లైన మార్టిన్‌ గుప్తిల్‌(2,271), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(2,140) మాత్రమే ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని మాలిక్‌ ఆక్రమించాడు. ఫలితంగా విరాట్‌ కోహ్లి(1,992)ను మాలిక్‌ అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లిని వెనక్కునెట్టిన షోయబ్‌ మాలిక్‌ (2,026) మూడో స్థానంలో నిలిచాడు.

మాలిక్‌ కంటే ముందే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  టీ20ల్లో 2వేల పరుగుల క్లబ్‌లో చేరుతాడనుకున్నారు. కానీ ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లి, రెండో మ్యాచ్‌లో 8 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో 2వేల పరుగులు చేరుకోవడానికి మరో ఎనిమిది పరుగుల దూరంలో నిలిచాపోయాడు.  ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లి రెండు వేల పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top