ధావన్‌ ఇన్‌.. సీనియర్‌ బౌలర్‌కు అనూహ్య చాన్స్‌!

Shikhar Dhawan, Ashish Nehra included in squad for Australia T20Is

సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల ట్వంట్వీ-20 ఇంటర్నేషనల్‌ సిరీస్‌ కోసం సీనియర్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు పిలుపు అందింది. 38 ఏళ్ల నెహ్రా చివరిసారిగా గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ఈ వెటరన్‌ బౌలర్‌కు జట్టులో చోటు దక్కడం ఇదే.  శనివారం నుంచి జరిగే ఈ టీ-20 సిరీస్‌ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐదో వన్డే ముగిసిన వెంటనే ప్రకటించిన టీ-20 జట్టులో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాతోపాటు.. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు చోటు దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను దగ్గరుండి చూసుకునేందుకు ధావన్‌ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ధావన్‌ లేకపోవడంతో అతని స్థానంలో అజింక్యా రహానే.. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు ధావన్‌ రావడంతో రహానేపై వేటు పడింది. వికెట్‌ కీపర్‌గా మహేంద్రసింగ్‌ ధోనీని ఎంపికచేయడంతోపాటు అదనంగా దినేశ్‌ కార్తీక్‌ను కూడా తీసుకోవడం గమనార్హం.

టీమిండియా జట్టు ఇదే
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్థిక్‌ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్.

Back to Top