10 వికెట్ల తేడాతో ఇరగదీశారు..

Shefali And Mandhana Guides India To10 Wicket Victory - Sakshi

సెయింట్‌ లూసియా: వెస్టిండీస్‌తో మహిళలతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు ఇరగదీస్తోంది. వన్డే సిరీస్‌ను గెలిచిన ఊపు మీద ఉన్న  భారత మహిళలు.. టీ20ల్లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన తొలి టీ20 గెలిచిన రోజు వ్యవధిలోనే భారత జట్టు మరొక విజయాన్ని అందుకుంది. రెండో టీ20లో భారత్‌ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను 20 ఓవర్లలో 103 పరుగులకే కట్టడి చేసిన భారత మహిళలు.. బ్యాటింగ్‌లో సత్తాచాటారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ(69 నాటౌట్‌; 35 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లు), స్మృతీ మంధాన( 30 నాటౌట్‌: 28 బంతుల్లో 4 ఫోర్లు)లు రాణించడంతో భారత్‌ ఘన విజయం సాధించింది.(ఇక్కడ చదవండి: మంధాన, షెఫాలీ ‘రికార్డు’ బ్యాటింగ్‌)

తొలి టీ20లో హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనతను పిన్నవయసులో సాధించిన రికార్డును నమోదు చేసిన షెఫాలీ.. రెండో టీ20లో కూడా అదే పునరావృతం చేశారు.  ఆది నుంచి దూకుడుగా ఆడుతూ విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్‌ 10.3 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా గెలుపును అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మహిళలు 104 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించారు. హేలీ మాథ్యూస్‌(23), చీడియాన్‌ నేషన్‌(32)లు మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు సాధించి విండీస్‌ పతనాన్ని శాసించారు. ఆమెకు జతగా శిఖా పాండే, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్‌లు తలో వికెట్‌ తీశారు.(ఇక్కడ చదవండి: రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top