తప్పుదొరికిందని అక్తర్‌ రెచ్చిపోయాడు : పాక్‌ కెప్టెన్‌

Sarfraz Ahmed Hits Back At Shoaib Akhtar For Personal Attacks - Sakshi

కరాచీ : దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగు వన్డేల నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల పట్ల దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ పెహ్లువాకియాకు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పినప్పటికి నిబంధనల మేరకు ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే ఈ తరహా వ్యాఖ్యలతో సర్ఫరాజ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు.

‘ఓ పాకిస్తానీయుడిగా ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించను. తన వ్యాఖ్యల పట్ల సర్ఫరాజ్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే’ అని ఘాటుగా ట్వీట్‌ చేశాడు. అయితే పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఒత్తిడో లేక ఎమో కానీ వెంటనే మళ్లీ తన వ్యాఖ్యల పట్ల యూటర్న్‌ తీసుకున్నాడు. సర్ఫరాజ్‌ వంటి ఆటగాడు పాక్‌కు ఎంతో అవసరమని, అతను సాధారణ శిక్షతో భయపడతాడని ఆశిస్తున్నానని ట్వీట్‌ చేశాడు. ఐసీసీ చర్యల అనంతరం ఈ నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ సమయం త్వరగా ముగుస్తుందని పేర్కొన్నాడు.

అయితే అక్తర్‌ మాటలు విమర్శల్లా లేవని, వ్యక్తిగతంగా దాడి చేసినట్లు ఉందని సర్ఫరాజ్‌ అభిప్రాయపడ్డాడు. సస్పెన్షన్‌తో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా పాకిస్తాన్‌కు వచ్చిన సర్ఫరాజ్‌ మీడియాతో మాట్లాడాడు. అక్తర్‌ వ్యక్తిగతంగా దాడి చేశాడు. అతని మాటలు విమర్శల్లా లేవు. ఇప్పటికే నేను నా తప్పును అంగీకరించాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ)కు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆటపరంగా.. వ్యక్తిత్వంగా మరింత మెరగవుతాను. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని సర్ఫరాజ్‌ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా క్రీజ్‌లో పాతుకుపోయిన ఆల్‌రౌండర్‌ ఫెలుక్‌వాయోను ఉద్దేశించి సర్ఫరాజ్‌.. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెను ఏం ప్రార్ధించమన్నావు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇవి స్టంప్స్‌ మైక్‌లో రికార్డవ్వడంతో రచ్చ రచ్చైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top