ధోని మౌనం వీడేనా ?

Sakshi Special Story on MS DHONI birthday

నేడు ఎమ్మెస్‌ ధోని 39వ పుట్టిన రోజు

జట్టులో పునరాగమనంపై నిరీక్షణ

సాక్షి క్రీడా విభాగం: మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం మహేంద్ర సింగ్‌ ధోనికి ‘ఐస్‌’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్‌లో ధోని ఒక అద్భుతం.

‘నేను సిరీస్‌ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్‌ కూల్‌’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్‌ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి.

తాను బ్యాట్స్‌మన్‌గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్‌ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్‌ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్‌ సెంటర్‌లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది.

2019 జూలై 9న ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ధోని తన ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. ఇప్పుటికి సరిగ్గా ఏడాదవుతోంది. ఆ తర్వాత అతను కనీసం స్థానిక మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. రేపు నిజంగా ఏదైనా సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఈ సంవత్సరపు విరామాన్ని సెలక్టర్లు ఎలా చూస్తారు. ఎంత గొప్ప ధోని అయినా అసలు ఇంత కాలం ఆడకుండా అతడిని నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాగలరా అనేదానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెస్‌ తనంతట తానుగా ఏదైనా చెబితే తప్ప ఏదీ తెలీదు. అయినా ధోని నిజంగా తప్పుకోవాలనుకుంటే ముహూర్తాలు, పుట్టిన రోజు సందర్భాలు చూసుకునే రకం కాదు. భవిష్యత్తు ఎలా ఉన్నా క్రికెట్‌ అభిమానులకు ఎమ్మెస్‌ పంచిన మధుర జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుగులు, గణాంకాల గురించి కాసేపు పక్కన పెడితే ‘ధోని ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌స్టయిల్‌’ అనే కేక మీ చెవుల్లో ఎప్పటికీ మారు మోగిపోతూనే ఉంటుంది.

ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ధోని క్రికెట్‌ పరుగు పిచ్‌ మధ్యలో ఆగిపోయింది. ఏదో ఒక ఎండ్‌కు చేరుకోకుండా ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉంది. నిస్సందేహంగా మాహికి ఆటపై పిచ్చి ప్రేమ ఉంది. కానీ కనుచూపు మేరలో క్రికెట్‌ కనిపించని వేళ అతని ఆలోచనలేమిటో కనీసమాత్రంగా కూడా ఎవరూ ఊహించలేరు. తన ఆంతర్యం ఏమిటో బయట పెట్టడు. తన మౌన ముద్రను వీడి మాట్లాడడు. బాహ్య ప్రపంచానికి దూరంగా తన మానాన తాను ఫామ్‌ హౌస్‌లో కుటుంబంతో, పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మినహా క్రికెట్‌ గురించి పట్టించుకోడు.

ఐపీఎల్‌ కోసం మొదలు పెట్టిన సాధన కరోనా దెబ్బతో ఆగిపోయింది. అక్కడ ఆడితే అనుభవం కోసమైనా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌కు వెళ్లవచ్చని అంతా అనుకున్నారు. కానీ అటు ఐపీఎల్‌ లేదు ఇటు ప్రపంచకప్‌ సంగతి దేవుడెరుగు. అనుభవాన్ని, అందించిన విజయాలను గౌరవిస్తూ గత సెలక్షన్‌ కమిటీ విశ్రాంతి అంటూనో, మరో కారణం చెప్పో అధికారికంగా వేటు మాట చెప్పలేకపోయింది. బోర్డులో మరెవరూ ధోని ఆట ముగిసిందని చెప్పే సాహసం చేయలేదు. గంగూలీ కూడా నాకు అతని భవిష్యత్తు గురించి అంతా తెలుసు అంటాడే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కచ్చితంగా చెప్పడు. కోచ్‌ రవిశాస్త్రితోనో, కోహ్లి నోటి వెంటనో ధోనికి ఆసక్తి తగ్గిందన్నట్లుగా పరోక్ష సంకేతాలే వస్తాయి తప్ప ఆట ముగిసిపోయిందని స్పష్టంగా ఎవరూ ఏమీ చెప్పరు. కొత్త సెలక్షన్‌ కమిటీకి ఇంకా ఇప్పటి వరకు పని చేయాల్సిన అవసరమే రాలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top