సైనా, సింధు శుభారంభం | Sakshi
Sakshi News home page

సైనా, సింధు శుభారంభం

Published Thu, Apr 28 2016 1:21 AM

సైనా, సింధు శుభారంభం

శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
డబుల్స్‌లో ఖేల్‌ఖతం
ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ

 
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీలకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. దాంతో ఈ మెగా ఈవెంట్‌లో భారత ఆశలన్నీ సైనా, సింధులపైనే ఉన్నాయి.


 సింగపూర్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించిన తర్వాత రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకున్న సైనా ఈ టోర్నీలో బరిలోకి దిగింది. ప్రపంచ 49వ ర్యాంకర్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్‌లో సైనా 21-16, 21-17తో గెలిచింది. కేవలం 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఆరంభంలో కాస్త పోటీ ఎదురైనా కీలకదశలో వరుస పాయింట్లు సాధించి పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-10, 21-13తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)ను ఓడించింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సైనా... తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు.


పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏకైక భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. వరుసగా ఐదో టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ఆటగాడు తొలి రౌండ్‌ను అధిగమించడంలో విఫలమయ్యాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-13, 12-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలలోనూ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.


పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 13-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావ (జపాన్)ల చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ 19-21, 17-21తో ఆర్ చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ (హాంకాంగ్)ల చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని ద్వయం 15-21, 11-21తో చాంగ్ యె నా-లీ సో హీ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
Advertisement