వార్నర్‌-బెయిర్‌స్టోల  భాగస్వామ్యం అసాధారణం

Sachin Tweets About Warner, Bairstow Partnership - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుతో ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు  డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో నెలకొల్పిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యంపై పలువురు క్రీడా దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పటికీ అలసిపోకుండా, వికెట్ల మధ్య చకాచకా పరుగులు తీస్తూ, అద్బుతమైన  క్రికెటింగ్‌ షాట్లు ఆడుతూ మరిచిపోలేని భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పారని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశారు.
                            
డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో సెంచరీల మోత వల్ల సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌ కెరీర్‌లో వార్నర్‌ నాలుగు సెంచరీలు చేయగా మూడు సెంచరీలు ఇదే మైదానంలో సాధించడం విశేషం. వార్నర్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. 114 పరుగులు చేసిన బెయిర్‌ స్టో ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోరు చేయగా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌..  సన్‌రైజర్స్‌ బౌలర్‌ మహ్మద్‌ నబీ(11/4) ధాటికి 19.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 118 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

తమ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని, మహ్మద్‌ నబీ, సందీప్‌లు బౌలింగ్‌లో రాణించడంతో బెంగుళూర్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగామని, సీరిస్‌ మొత్తం ఇలాగే విజయ పరంపర కొనసాగిస్తామని సన్‌రైజర్స్‌ మెంటర్‌  వీవీఎస్‌ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top