బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్‌కు మొదటి ఓవర్‌లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
తొలి రెండు బంతుల్లోనే ఇన్ ఫామ్ మాథ్యూ గిల్క్స్, సామ్ కాన్‌స్టాస్ వికెట్లను సిడ్నీ కోల్పోయింది. ఈ సమయంలో వార్నర్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి వార్నర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ముఖ్యంగా హరికేన్స్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లిస్‌ను వార్నర్ ఉతికారేశాడు.
ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వార్నర్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో తన 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ(బీబీఎల్ సెంచరీ)కు డేవిడ్ భాయ్ తెరదించాడు.
మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్నిహోబర్ట్ హరికేన్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. దీంతో సిడ్నీ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
కోహ్లి రికార్డు సమం..
అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 9 సెంచరీలు చేయగా.. వార్నర్ కూడా సరిగ్గా తొమ్మిది సతకాలు నమోదు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(22) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో పాక్ స్టార్ బాబర్ ఆజం ఉన్నాడు.
చదవండి: మహ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లేనా..?


