డేవిడ్‌ వార్నర్‌ ఎందుకిలా?: సచిన్‌

Sachin Tendulkar surprised with David Warners slow batting vs India - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. గతానికి భిన్నంగా వార్నర్‌ నెమ్మదిగా ఆడటం వికెట్లను తొందరగా కోల్పోకూడదనే జరిగి ఉంటుందని, అయితే లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పుడు స్టైక్‌ రోటేషన్‌ నెమ్మదిస్తే ఒత్తిడి పెరుగుతుందని సచిన్‌ అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా బౌలింగ్‌ ఆరంభించినప్పుడే ఆసీస్‌ను కట్టడి చేసి ఒత్తిడికి గురిచేసింది. వార్నర్‌ ఇలా నెమ్మదిగా ఆడటం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసం కోల్పోయిందనిపించింది. అంతటి భారీ లక్ష్యాన్ని సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ ఛేదించడం కష్టం’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఆదిలోనే వికెట్లు పోగొట్టుకోకూడదని ఆస్ట్రేలియా భావించిందని, అదే సమయంలో వారు స్ట్రైక్‌రొటేట్‌ చెయ్యలేకపోవడం కూడా భారత్‌కు కలిసొచ్చిందని చెప్పాడు. అందువల్లే టీమిండియా బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారని, నిజం చెప్పాలంటే స్మిత్‌ బ్యాటింగ్‌కు వచ్చాకే స్ట్రైక్‌రొటేట్‌ చేశారని తెలిపాడు. ఇక భారత జట్టు సమష్టి కృషి కూడా విజయానికి ప్రధాన కారణం అని సచిన్‌ తెలిపాడు. హార్దిక్‌ పాండ్యా క్యాచ్‌ను ఆసీస్‌ వదిలేయడం భారత్‌కు వరంగా మారిందన్నాడు. హార్దిక్‌ క్యాచ్‌ను వదిలేసిన తర్వాత అతను చెలరేగడంతో ఆసీస్‌ అందుకు మూల్యం చెల్లించుకుందన్నాడు. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 353 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ను 316 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ విజయం సాధించింది. ఇక డేవిడ్‌ వార్నర్  66.67 స్టైక్‌ రేట్‌తో ‌56 పరుగులు చేశాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top