వాళ్లు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలి : సచిన్‌

Sachin Tendulkar Sues Australian Bat Manufacturer Over Royalty Issue - Sakshi

సిడ్నీ : ఒప్పందాన్ని అతిక్రమించి తన పేరు, ఇమేజ్‌ను వాడుకుంటున్నారని ఆరోపిస్తూ టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోర్టును ఆశ్రయించాడు. స్పార్టాన్‌ స్పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ అనే బ్యాట్ల తయారీ కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సివిల్‌ దావా వేశాడు. రాయల్టీ కింద తనకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు. రాయిటర్స్‌ కథనం ప్రకారం.. సిడ్నీకి చెందిన స్పార్టాన్‌ స్పోర్ట్స్‌ 2016లో సచిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తమ కంపెనీ బ్యాట్లపై సచిన్‌ పేరు, లోగోను వాడుకునేందుకు వీలుగా ఏడాదికి 1 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల చొప్పున చెల్లించేందుకు అంగీకరించింది. అంతేకాకుండా తమ కంపెనీకి చెందిన వివిధ బ్రాండ్ల ప్రమోషన్‌ కోసం సచిన్‌ ఇమేజ్‌ను వాడుకునేలా డీల్‌ కుదుర్చుకుంది.

ఈ క్రమంలో లండన్‌, ముంబైలలో ‘సచిన్‌ బై స్పార్టాన్‌’ పేరిట నిర్వహించిన పలు ఈవెంట్లలో సచిన్‌ పాల్గొన్నాడు. అయితే 2018లో వరకు ఇందుకు సంబంధించిన పేమెంట్లు చేయకపోవడంతో సచిన్.. స్పార్టాన్‌ అధికారులను సం‍ప్రదించగా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో స్పార్టాన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సచిన్‌ టీమ్‌ వారికి సమాచారమిచ్చింది. అయినప్పటికీ స్పార్టాన్‌ మాత్రం సచిన్‌ ఇమేజ్‌ను వాడుకుంటూనే ఉంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని మీరినందుకు గానూ తనకు 2 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్లు చెల్లించాలంటూ కోర్టును సచిన్‌ ఆశ్రయించాడు. కాగా సచిన్‌ లీగల్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్బర్డ్‌ టాబిన్‌ ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించింది. స్పార్టాన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన మాట వాస్తవమేనని సివిల్‌ దావాలో సచిన్‌ పేర్కొన్నారు. అయితే ఎటువంటి నష్టపరిహారం అడుగుతున్నారనే దానిపై మాత్రం ఇందులో స్పష్టతనివ్వలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top