38 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సచిన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. చూడచక్కని ఫుట్‌వర్క్‌తో చేసిన డ్రైవ్స్, డిఫెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది.
38 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సచిన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. చూడచక్కని ఫుట్‌వర్క్‌తో చేసిన డ్రైవ్స్, డిఫెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆరంభంలో బౌన్సర్లతో బెస్ట్ ఇబ్బందిపెట్టినా... స్పిన్నర్లు గింగరాలు తిప్పినా... సచిన్ బ్యాట్ మాత్రం అదరలేదు.. బెదరలేదు. బొంగరం తిప్పినంత సులువుగా బ్యాట్‌ను తిప్పిన మాస్టర్... షిల్లింగ్‌ఫోర్డ్ బంతులను ‘లేట్ కట్’ చేసిన దృశ్యం అభిమానులను తన్మయత్వంలో ముంచెత్తింది. బెస్ట్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌తో కొట్టిన బలమైన పంచ్‌కు బంతి కవర్స్‌లో వెళ్తుంటే దాన్ని అందుకోవడానికి ముగ్గురు ఫీల్డర్లు పరుగు తీయడం మర్చిపోలేని అనుభూతి. వేగంగా వచ్చిన బెస్ట్ బంతిని ఒక్క అడుగు ముందుకేసి సున్నితంగా నెడుతూ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ ఓ అద్భుతం.
దీంతో సచిన్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవలి బంతులను ఎదుర్కొన్న తీరైతే అమోఘం. బంతి ఎలా కదిలితే అలా శరీరాన్ని వంచుతూ కొట్టిన ఫుల్‌డ్రైవ్స్ మాస్టర్ ఇన్నింగ్స్‌ను మదిలో నింపేశాయి. పుజారాతో మంచి సమన్వయం కుదరడంతో సచిన్ ఇన్నింగ్స్ ఓ ప్రవాహంలా సాగిపోయింది. ఈ క్రమంలో సెంచరీ దిశగా సాగుతున్న ఈ ముంబై గ్రేట్‌ను డ్రింక్స్ తర్వాత దేవ్‌నారాయణ్ దెబ్బతీశాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చిన బంతిని కట్ చేస్తే స్లిప్‌లో స్యామీ చేతిలోకి వెళ్లింది. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది.
మాస్టర్ ఇన్నింగ్సే అత్యుత్తమం
‘తీవ్ర ఒత్తిడి, అంచనాల మధ్య చివరి టెస్టు ఆడుతున్న సచిన్ పరిస్థితిని చూస్తే నేను, రోహిత్ చేసిన సెంచరీలకంటే మాస్టర్ ఇన్నింగ్సే అత్యుత్తమం. మైదానంలో ప్రేక్షకుల హోరు మధ్య మనసు లగ్నం చేయడం అంత సులభం కాదు. సచిన్ ఆఖరి ఇన్నింగ్స్ సమయంలో మరో వైపు క్రీజ్‌లో ఉండటం నాకో ప్రత్యేక అనుభూతి. టెయిలెండర్ల సహాయంతో రోహిత్ సెంచరీ చేసిన తీరు వీవీఎస్ లక్ష్మణ్‌ను గుర్తుకు తెచ్చింది’.
- చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్