ధోనిని వెనక్కినెట్టిన పంత్‌

Rishabh Pant beats MS Dhoni, attains joint highest ranking for Indian wicketkeeper - Sakshi

దుబాయ్‌: ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో శతకం సాధించి ఆస్ట్రేలియాలో ఆ ఘనత సాధించిన తొలి టీమిండియా వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించిన రిషభ్‌ పంత్‌.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో సైతం అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక్కసారిగా 21 స్థానాలు ఎగబాకి 17 స్థానంలో నిలిచాడు.  రిషభ్‌ పంత్‌ 673 రేటింగ్‌ పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫలితంగా భారత్‌ తరఫున బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన స్పెషలిస్టు వికెట్‌ కీపర్ల జాబితాలో ఫరూఖ్‌ ఇంజనీర్‌ సరసన నిలిచాడు. 1973, జనవరిలో ఫరూఖ్‌ ఇంజనీర్‌ 17 ర్యాంకును సాధించగా, ఇప్పుడు అతని సరసన పంత్‌ చేరాడు. కాగా, ఈ క్రమంలోనే  ఎంఎస్‌ ధోని అత్యుత్తమ టెస్టు ర్యాంకును పంత్‌ బ్రేక్‌ చేశాడు. ధోనీ టెస్టు కెరీర్‌లో 19వ ర్యాంకే అత్యుత్తమ ర్యాంక్‌ కాగా, ధోని టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు 662గా ఉంది.

ఇక టెస్టు నంబర్‌వన్‌ ర్యాంకింగ్‌ను విరాట్‌ కోహ్లి నిలబెట్టుకున్నాడు.  ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన పుజారా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. మరొకవైపు రవీంద్ర జడేజా, మయాంక్‌ అగర్వాల్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఆరు స్థానాలు ఎగబాకిన భారత ఆల్‌రౌండర్‌ జడేజా 57వ స్థానంలో నిలవగా, మయాంక్‌ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 62వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పలువురు టీమిండియా బౌలర్లు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. కుల్దీప్‌ యాదవ్‌ ఏడు స్థానాలు ఎగబాకి 45వ స్థానంలో నిలవగా, బుమ్రా 16,  షమీ 22వ స్థానాల్లో నిలిచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top