
రాజ్‌కోట్: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రవిశాస్త్రికి, స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌లకు ఒకే సారూప్యత ఉంది. వీరిద్దరూ ఎడంచేతి వాటం స్పిన్నర్లే కాకుండా బ్యాట్‌తోనూ చెలరేగి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొనగాళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరి సరసన మరో పేరు చేరింది. ఆ పేరే రవీంద్ర జడేజా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు దూరమైన జడేజా తన సొంత జట్టు సౌరాష్ట్ర తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సీఏ) అంతర్ జిల్లా టి20 టోర్నమెంట్‌లో శుక్రవారం జడేజా అద్భుతం చేశాడు.
అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జామ్ నగర్ జట్టు తరఫున ఆడిన జడేజా కేవలం 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి 154 పరుగులు సాధించాడు. ఆఫ్ స్పిన్నర్ నీలమ్ వంజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో జడేజా ఆరు బంతులను ఆరు సిక్స్‌లుగా మలిచాడు. జడేజా అద్భుత ప్రదర్శనతో జామ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగుల భారీ స్కోరు చేయగా... అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గతంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్... 1985 రంజీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ముంబై తరఫున రవిశాస్త్రి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టారు.