ఆ విషయంలో ధోనికి సాటేలేరు: రవిశాస్త్రి

Ravi Shastri Says Dhoni Best in 50 Over Format - Sakshi

ముంబై : సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురపించాడు. వన్డే ఫార్మాట్‌లో ధోనిని మించిన ఆటగాడే లేడని కొనియాడాడు. మెగాటోర్నీ వరల్డ్‌కప్‌ కోసం ఇంగ్లండ్ బయల్దేరడానికి ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి కోచ్ రవిశాస్త్రి మీడియాతో ముచ్చటించాడు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ప్రపంచకప్‌ టీమిండియాదేనని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిని అధిగమించడమే ముఖ్యమన్న కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్యలను సమర్ధిస్తూ..  ఈ విషయంలో ధోనికి సాటిలేరని ఆకాశానికెత్తాడు. మైదానంలో ధోని చేసే కొన్ని పనులు ఆటను పూర్తిగా మార్చేస్తాయన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ధోని కీలక పాత్ర పోషిస్తాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌ కోహ్లి, ధోని మధ్య కమ్యూనికేషన్ బాగుందని, ధోని సలహాలు జట్టుకు ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో వికెట్ల వెనుక ధోని చురుగ్గా స్పందించిన తీరు, హిట్టింగ్ చేసిన విధానాన్ని గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌ బిగ్‌స్టేజ్‌ అయినప్పటికి ఆటగాళ్లు ఈ టోర్నీని ఆస్వాదించాలని అభిప్రాయపడ్డాడు. రౌండ్‌ రాబిన్‌ పద్దతి సవాల్‌తో కూడుకున్నదని, ఈ పద్దతితో మ్యాచ్‌ల మధ్య అంతరాయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో గట్టి పోటీ ఎదురుకానుందని, అన్ని జట్లు బలంగానే ఉన్నాయని, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ జట్లు సైతం గత ప్రపంచకప్‌కు ఇప్పటికీ చాలా ధృడంగా తయారయ్యాయని చెప్పుకొచ్చాడు. కేదార్‌ జాదవ్‌ గత ఐదేళ్లుగా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని, అతను గాయం నుంచి కోలుకోవడం శుభపరిణామమన్నాడు.  చివరి పది ఓవర్లు జాగ్రత్తగా ఆడటం, ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక అంతకుముందు కోహ్లి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉందని, మెరుగైన ప్రదర్శన చేయడమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top