క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్‌ వర్మ | Rahul, Siril Verma in Quarters of All india Badminton | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్‌ వర్మ

Apr 20 2019 4:35 PM | Updated on Apr 20 2019 4:35 PM

Rahul, Siril Verma in Quarters of All india Badminton - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్‌ యాదవ్, సిరిల్‌ వర్మ ముందంజ వేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ రాహుల్‌ యాదవ్‌ 21–14, 21–9తో మునావర్‌ మొహమ్మద్‌ (కేరళ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో పదమూడో సీడ్‌ సిరిల్‌ వర్మ (తెలంగాణ) 21–13, 21–15తో కార్తికేయ గుల్షన్‌ కుమార్‌ (ఢిల్లీ)పై నెగ్గాడు. ఏపీ ప్లేయర్‌ జశ్వంత్‌ 23–21, 13–21, 9–21తో మిథున్‌ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు.

మహిళల సింగిల్స్‌లో ఏపీ క్రీడాకారిణి నిషిత వర్మ, తెలంగాణ ప్లేయర్‌ కేయూర మోపాటి ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయారు. నిషిత వర్మ 16–21, 12–21తో నమిత పథానియా (ఢిల్లీ) చేతిలో, కేయూర (తెలంగాణ) 21–19, 14–21, 10–21తో ఎనిమిదో సీడ్‌ ఐరా శర్మ (హరియాణా) ఓడింది. పురుషుల డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయి కుమార్‌ జంట క్వార్టర్స్‌కు చేరుకోగా...  కృష్ణ ప్రసాద్‌ జోడీ రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ)–గౌస్‌ షేక్‌ (ఏపీ) జంట 21–8, 21–13తో మధుసూదన్‌ (కర్ణాటక)–సంజీత్‌ (రైల్వేస్‌) జోడీపై గెలుపొందింది. రెండోసీడ్‌ కృష్ణ ప్రసాద్‌ (ఏపీ)–ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–16, 21–11తో అక్షయ్‌–అనిరుద్ధ మయేకర్‌ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీకృష్ణ–కనిక కన్వల్‌ జోడీ, హేమనాగేంద్ర బాబు–శ్రీవిద్య గురజాడ జంటలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ)–కనిక కన్వల్‌ (రైల్వేస్‌) జంట 21–17, 22–24, 21–17తో టాప్‌ సీడ్‌ గౌస్‌ షేక్‌ (ఏపీ)–మనీషా (ఆర్‌బీఐ) జోడీకి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్‌)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంట 16–21, 21–6, 21–19తో ప్రతీక్‌ రనడే–అక్షయ వరంగ్‌ (మహారాష్ట్ర) జోడీపై నెగ్గింది.   

Advertisement
 
Advertisement
Advertisement