పుణేరి పల్టన్‌కు ఊరట | Puneri relief to paltan | Sakshi
Sakshi News home page

పుణేరి పల్టన్‌కు ఊరట

Published Mon, Aug 17 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

పుణేరి పల్టన్‌కు ఊరట

పుణే : వరుస పరాజయాలతో డీలా పడిన పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2 చివరి దశలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33-28 పాయింట్ల తేడాతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పుణేరి పాయింట్ల సంఖ్య 19కు పెరిగినా, లీగ్‌లో మాత్రం చివరిదైన ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. జితేశ్ జోషి ఏడు పాయింట్లు, సంజయ్ కుమార్ ఆరు పాయింట్లు సాధించి పుణేరి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ జోరు కనబరిచినా... రెండో అర్ధభాగంలో పుణేరి జట్టు పుంజుకుంది.

విరామ సమయానికి ఢిల్లీ 18-11తో ఏడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో పుణేరి ఆటగాళ్లు అద్భుత రైడింగ్‌తో ఢిల్లీ జట్టును ఆలౌట్ చేశారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్స్ కాశిలింగ్, శ్రీకాంత్ రాణించినా డిఫెన్స్‌లో లోపాల కారణంగా ఆ జట్టు చివర్లో తడబడింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39-38తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బెంగాల్ 24-14తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ జట్టు పోరాడినా ఆఖరికి పాయింట్ తేడాతో ఓడిపోయింది. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement