
పీకేఎల్‌లో వరుసగా నాలుగో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన తొలి పోరులో దబంగ్ ఢిల్లీ 45–34 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై సునాయాస విజయం సాధించింది. కెపె్టన్ అశు మలిక్ 16 పాయింట్లతో విజృంభించగా... అజింక్య పవార్ (8 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (6 పాయింట్లు) సారథికి సహకరించారు.
బెంగాల్ వారియర్స్ కెపె్టన్ దేవాంక్ 12 పాయింట్లు సాధించగా... విశ్వాస్ 9 పాయింట్లతో పోరాడాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే దబంగ్ ఢిల్లీ ఆధిక్యం సాధించింది. నీరజ్, అజింక్య సూపర్ రెయిడ్‌లతో ఢిల్లీ జట్టు వరుస పాయింట్లు సాధించగా... ఆ తర్వాత అశు చెలరేగిపోయాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 4 మ్యాచ్‌లాడి ఒక విజయం, 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అట్టడుగున ఉంది.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ‘గోల్డెన్ రైడ్’లో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘గోల్డెన్ రైడ్’ నిర్వహించాల్సి వచ్చింది. మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 15 పాయింట్లతో సత్తా చాటగా... గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 11 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్... యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.