తొలి టైటిల్‌ వేటలో సౌరాష్ట్ర 

Pujara vs Umesh in focus as Saurashtra take on Vidarbha in Ranji - Sakshi

ట్రోఫీని నిలబెట్టుకునేందుకు విదర్భ 

జోరు మీదున్న పుజారా 

నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్‌ 

నాగ్‌పూర్‌: భారత స్టార్లు చతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌ యాదవ్‌ల మధ్య ఆసక్తికర పోరుకు రంజీ ఫైనల్‌ వేదిక కానుంది. నేటి నుంచి సౌరాష్ట్ర, డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. విదర్భ జట్టు వసీమ్‌ జాఫర్‌ అండతో వరుసగా రెండో టైటిల్‌ సాధించాలని భావిస్తుండగా... పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర ఈ సారైన విజేతగా నిలవాలని ఆశిస్తోంది. గతంలో ఈ జట్టు 2012–13, 2015–16 సీజన్లలో ఫైనల్‌ చేరినా... ఈ రెండు సార్లు ముంబై ధాటికి రన్నరప్‌గా సంతృప్తి పడింది. ఈ సారి ముంబై ‘ఫోబియా’ లేదు. దీంతో ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా రంజీ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో సౌరాష్ట్ర ఉంది.

ఈ జట్టు ఆశలన్నీ పుజారాపైనే పెట్టుకుంది. ఆస్ట్రేలియా పర్యటన మొదలు ఇప్పటివరకు అతని జోరు అద్భుతంగా కొనసాగుతోంది. కర్ణాటకతో జరిగిన సెమీస్‌లో క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా విలువైన శతకంతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ జట్టుకు 9వ నంబర్‌ ఆటగాడి వరకు బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది. మరోవైపు వెటరన్‌ వసీం జాఫర్‌ ఫామ్‌తో విదర్భ పటిష్టంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడకు మారుపేరైన జాఫర్‌ ఇప్పటికే 1003 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌ సెంచరీ సహా నాలుగు శతకాలున్నాయి. జట్టుకు అతనే బలం. అతను క్రీజులో నిలబడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు.

ఈ జట్టులోనూ టెయిలెండర్లు సైతం పరుగులు జతచేయగలరు. గత 10 మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ 30 పైచిలుకు సగటును నమోదు చేశారు. జాఫర్‌తో పాటు కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (786 పరుగులు), యువ బ్యాట్స్‌మన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (680) చక్కని ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రెండు దీటైన జట్ల మధ్య హోరాహోరీ సమరం జరిగే అవకాశముంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top