రూ.50 కోట్లు.. 200 మంది ఆటగాళ్లు!

PRO Kabaddi Auction Telugu Titans Bags Siddharth Desai For Huge Amount - Sakshi

ముంబై :  ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌కు సంబంధించి రెండు రోజుల పాటు సాగిన వేలం మంగళవారం ముగిసింది. 12 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 200 మంది ఆటగాళ్లను ఎంచుకున్నాయి. వీరిలో 173 మంది భారత ఆటగాళ్లు కాగా, 27 మంది విదేశీయులు ఉన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు మొత్తం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. కేటగిరీ ‘బి’లో డిఫెండర్‌ మహేందర్‌ సింగ్, రైడర్‌ మన్‌జీత్‌ సింగ్‌లకు అత్యధిక మొత్తాలు లభించాయి. మహీందర్‌ను బెంగళూరు బుల్స్‌ రూ. 80 లక్షలకు తీసుకోగా, మన్‌జీత్‌ను పుణేరీ పల్టన్‌ రూ. 63 లక్షలకు ఎంచుకుంది. ఆల్‌రౌండర్స్‌ కేటగిరీలో యు ముంబా రూ. 89 లక్షలతో సందీప్‌ నర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేసుకుంది.

ఇక తొలి రోజు సోమవారం సాగిన ప్రధాన వేలంలో ఇద్దరు ఆటగాళ్లు సిద్ధార్థ్‌ దేశాయ్‌ (రూ. 1.45 కోట్లు), నితిన్‌ తోమర్‌ (రూ.1.20 కోట్లు)లకు కోటి రూపాయలకు పైగా విలువ లభించింది. రెండో రోజు ‘ఎ’ కేటగిరీ డిఫెండర్స్‌ విభాగంలో రూ.60 లక్షలకు విశాల్‌ భరద్వాజ్‌ను తెలుగు టైటాన్స్‌ సొంతం చేసుకుంది.  సీజన్‌-7 ఈ ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్‌ 9 వరకు జరుగుతుంది. మరో వైపు తనకు భారీ మొత్తం లభించడంపై సిద్ధార్థ్‌ దేశాయ్‌ స్పందిస్తూ... ‘వేలంలో నాకు పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యాను. నాది సాధారణ కుటుంబం. మా నాన్న రైతు. కబడ్డీ ఆటగాడిగా ఎదగడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నన్ను ఇంత పెద్ద మొత్తానికి ఎంచుకొని నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన తెలుగు టైటాన్స్‌కు కృతజ్ఞతలు. టోర్నీలో బాగా ఆడి జట్టును గెలిపించేందుకు వంద శాతం కృషి చేస్తా’ అని అన్నాడు.  

తెలుగు టైటాన్స్‌ జట్టు ఇదే...
సిద్ధార్థ్‌ దేశాయ్, సూరజ్‌ దేశాయ్, రాకేశ్‌ గౌడ (రైడర్స్‌),    విశాల్‌ భరద్వాజ్, కృష్ణ మదన్, సి. అరుణ్, అబోజర్‌ మిగాని (డిఫెండర్స్‌), అర్మాన్, డ్యూయెట్‌ జెన్నింగ్స్, ఫర్హద్‌ రహీమి, శివగణేశ్‌ రెడ్డి, మనీశ్, ఆకాశ్‌ చౌదరి, అమిత్‌ కుమార్‌ (ఆల్‌రౌండర్లు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top