
ఆస్ట్రేలియా ‘ఎ’ 185/4
హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (3/52) భారత ‘ఎ’ జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న
చెన్నై: హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (3/52) భారత ‘ఎ’ జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార టెస్టులో స్పిన్ మ్యాజిక్‌తో మూడు వికెట్లు తీసి కంగారులను కట్టడి చేశాడు. దీంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కాంబ్ (137 బంతుల్లో 75 బ్యాటింగ్; 6 ఫోర్లు), స్టోనిస్ (87 బంతుల్లో 42 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారులు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉన్నారు. బాంక్రాఫ్ట్ (2), మాడిన్‌సన్ (0) విఫలమయ్యారు.
ఓ మోస్తరుగా ఆడిన ఉస్మాన్ ఖాజా (25), హెడ్ (31)లు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఓ దశలో 57/1 స్కోరుతో ఉన్న ఆసీస్... ఓజా దెబ్బకు 23 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకుని 75/4గా మారింది. అయితే హ్యాండ్స్‌కాంబ్, స్టోనిస్‌లు ఐదో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జోడించడంతో కోలుకుంది. అంతకుముందు 221/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.3 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. శంకర్ (51 నాటౌట్), అమిత్ మిశ్రా (27) మినహా లోయర్ ఆర్డర్‌లో మిగతా వారు నిరాశపర్చారు.