
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కామెంటేటర్లలో ఎక్కువగా వార్తల్లో నిలిచేది సంజయ్ మంజ్రేకర్. తన వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాడు మంజ్రేకర్. గత ఏడాది రవీంద్ర జడేజాను బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అనే వ్యాఖ్యలు దగ్గర్నుంచీ, కొన్ని రోజుల క్రితం సహచర కామెంటేటర్ హర్షాభోగ్లేను విమర్శస్తూ చేసిన వ్యాఖ్యల వరకూ వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. కాగా, మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా తొలి వన్డేకు బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా మంజ్రేకర్ వ్యాఖ్యానం అవసరం లేదంటూ చురకలంటించింది. (‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’)
ఈ క‍్రమంలోనే సంజయ్ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. ఇప్పుడు సంజయ్ మంజ్రేకర్ ముందుకొచ్చాడు. తమ వ్యాఖ్యానాన్ని కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే చూడాలని ఆటగాళ్లను కోరాడు. మాకు, మా కామెంటరీకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. కామెంటరీ చెప్పేటప్పుడు ఆటగాళ్లను గాయపరచకుండా వ్యాఖ్యానించడం దాదాపు కుదరని పని అన్నాడు. ఈ విషయంలో తమను అలంకార ప్రాయంగానే చూడాలని, అదే సమయంలో తమ కామెంటరీకి పెద్దగా ప్రాముఖ్యతనివ్వకుండా క్రికెటర్లు తమ పని తాము చేసుకుంటే ఇబ్బందేమీ ఉండదన్నాడు. ఈ క్రమంలోనే గతంలో తాను క్రికెట్ ఆడే సమయంలో ఎదురైన ఒక అనుభవాన్ని మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు.
‘నా బ్యాటింగ్ తీరును తప్పుబడుతూ దిలీప్ వెంగాసర్కార్ ఒక కాలమ్‌లో రాశాడు. అవి నన్ను బాధించాయి. ఆటగాళ్ళు సున్నితంగా ఉంటారు. నేను సున్నితంగా ఉండేవాడిని. తన కాలమ్‌లో వెంగీ విమర్శించినప్పుడు నేను చాలా బాధపడ్డా. అతని పరిశీలనలన్నింటినీ ఎదుర్కోవడానికి ప‍్రయత్నించా. ఇక్కడ మన ప్రదర్శన అనేది ముఖ్యం. మమ్మల్ని అలంకార ప్రాయంగా మాత్రమే చూడాలి. అన్నింటికంటే మన ఆట తీరే ముఖ్యం’ అని మంజ్రేకర్ తెలిపాడు. కామెంటేటర్‌లు చెప్పిన దానిని బట్టి జట్టులో నుంచి ఎవరూ తీసేయరనే విషయాన్ని ప్రతీ ఆటగాడు గమనించాలన్నాడు.. మంజ్రేకర్ విమర్శిస్తే, ఎవరినైనా తొలగించిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని, అప్పటి సందర్భాన్ని మాట్లాడిందే తప్ప ఇందులో ఒక ఆటగాడ్ని టార్గెట్ చేయడం అనేది ఉండదన్నాడు. (‘పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ టీమ్ ఉండాలి’)